‘సూపర్’ వైద్య సీట్లపై సర్కారు దృష్టి
⇒ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వాదన
⇒ విభజన చట్టంలో స్పష్టత లేక అయోమయం
⇒ అన్ని సీట్లను స్థానికులతోనే భర్తీ చేసే యోచన
⇒ న్యాయ సలహా తీసుకోవాలని సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ర్ట ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడమో లేక రాష్ర్టంలో ఉన్న సీట్లను ఇక్కడి వారితోనే భర్తీ చేయాలా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుండటం దీనికి కారణం. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్ సహా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 198 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. వీటిలో 110 సీట్లు తెలంగాణలో, 65 సీట్లు ఏపీలో ఉన్నాయి. మిగిలినవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి.
ప్రభుత్వ వాదన ప్రకారం తెలంగాణలో 110 సీట్లుంటే.. రాష్ట్ర విద్యార్థులకు దక్కేవి 48 సీట్లు మాత్రమే. 65 సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఏపీకి మాత్రం 96 సీట్లు దక్కుతున్నాయి. మిగిలిన 54 సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటున్నాయి. తెలంగాణలోని సీట్లన్నీ ఇక్కడి విద్యార్థులకే దక్కాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ 15 శాతం ఓపెన్ కేటగిరీని వదిలేసినా 100 సీట్లయినా దక్కాల్సిందేనని వాదిస్తున్నాయి.
ఉదాహరణకు నిమ్స్‌లో బ్రాడ్ స్పెషాలిటీలో 28 సీట్లుంటే అందులో ఏపీకి 16, తెలంగాణకు 7 సీట్లు దక్కుతున్నాయి. ఓపెన్ కేటగిరీలో మాత్రం ఐదు సీట్లున్నాయి. నిమ్స్ పీజీ సూపర్ స్పెషాలిటీలో 50 సీట్లుంటే అందులో ఏపీకి 30, తెలంగాణకు 12 సీట్లు మాత్రమే దక్కుతాయి.
ఆ రెండు సెక్షన్లు పరస్పర విరుద్ధం
విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం వచ్చే పదేళ్ల వరకు ఉన్నత విద్యలోని పాత కోటా సీట్లను గతంలో ఉన్నట్లే భర్తీ చేయాలి. అయితే సెక్షన్ 97 ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సీట్లు ఉండాలని పేర్కొన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. విభజన చట్టంలో గందరగోళం ఉన్నప్పటికీ సెక్షన్ 97 ప్రకారం తెలంగాణలోని సీట్లను తెలంగాణవారితోనే భర్తీ చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ‘తెలంగాణలోని ఉన్నత విద్యలో రాష్ట్రస్థాయి సీట్లకు అయ్యే ఖర్చు, ఫ్యాకల్టీ, విద్యార్థుల ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోంది.
ఏపీ ఒక్క పైసా కేటాయించలేదు. ఆ రాష్ట్ర విద్యార్థులు మాత్రం 64 శాతం సీట్లు పొందుతున్నార’ని జూనియర్ డాక్టర్ల సంఘం కన్వీనర్ శ్రీనివాస్ అంటున్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామన్నారు. కాగా, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని, ఆ తర్వాతే తగిన చర్యలు చేపడతామని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.