
సాక్షి, న్యూఢిల్లీ: బోధన రుసుము చెల్లించలేదన్న కారణంగా ఏ ఒక్క విద్యార్థిని కూడా పరీక్షలకు వెళ్లకుండా వాసవీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం అడ్డుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) నిర్ధారించిన బోధనా రుసుము కంటే ఎక్కువగా వాసవీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి వసూలు చేస్తోందంటూ వాసవీ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాదులు వి.మోహన, మహేశ్‌బాబు వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 3ను పట్టించుకోవడం లేదని, ఏఎఫ్‌ఆర్సీ నిర్ధారించిన బోధనా రుసుము కంటే అదనంగా వసూలు చేస్తున్నారని నివేదించారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌ఆర్సీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్పించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశిస్తూ, విచారణ నవంబర్ 13కు వాయిదా వేసింది.