సాక్షి, సిటీబ్యూరో: ‘అకస్మాత్తుగా కమీషన్లు తగ్గించేశారు. గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఇవ్వడం లేదు. ఆరు కిలోమీటర్లు దాటితే బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు అదీ లేదు. రాత్రింబవళ్లు కష్టపడ్డా రూ.700 కూడా దాటడం లేదు. రెండేళ్లు కష్టపడి పని చేశాను. ఇప్పుడు ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నాను. ఇంకేదైనా పని చేసుకోవాల్సిందే...’ స్విగ్గీ ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న నరేష్ ఆవేదన ఇది. ఒక్క నరేషే కాదు. వేలాది మంది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌లోనూ ఇదే ఆవేదన గూడు కట్టుకొని ఉంది. ఒకప్పుడు నెలకు రూ.20 వేలకు పైగా సంపాదించిన వాళ్లు ఇప్పుడు రూ.12 వేల కంటే ఎక్కువ ఆర్జించలేకపోతున్నారు.
♦ తమ ఆకలి సంగతి మరిచిపోయి ఎంతోమంది వినియోగదారుల ఆకలి తీర్చే డెలీవరీ బాయ్స్ ఇప్పుడు కనీస వేతనాలను సైతం అందుకోలేకపోతున్నారు. కొంతకాలంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు అనేక మార్పులు తెచ్చాయి. కమిషన్‌లలో కోత విధించాయి. ప్రోత్సాహకాలను తగ్గించాయి. దీంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు గురవుతున్నారు.
జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, ఫుడ్‌పాండా వంటి అన్ని ప్రధాన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లోనూ కమిషన్‌లను భారీగా తగ్గించి టార్గెట్‌లను పెంచారు. నిజానికి కొన్నేళ్లుగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ నగరవాసుల జీవన శైలిలో భాగమైంది. అన్ని వర్గాల ప్రజలు తమకు నచ్చిన ఆహారం కోసం ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. వినియోగదారుల నుంచి ఆర్డర్లు అందుకున్న డెలివరీ పసందైన రుచులతో క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న చిన్న హోటళ్లు మొదలుకొని అతి పెద్ద రెస్టారెంట్‌ల వరకు ఇప్పుడు ఆన్‌లైన్‌పైన ఆధారపడి ఉన్నాయి. కానీ డెలివరీ బాయ్స్ మాత్రం తమ ఆదాయాలను కోల్పోయి ఆందోళనకు గురవుతున్నారు.
ఇలా ‘వేటే’శారు....
నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలవరీ యాప్‌లలో జొమాటో, స్విగ్గీ అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధాన యాప్‌ల ద్వారా ప్రతి నెలా సుమారు 15 లక్షలకు పైగా ఫుడ్ ఆర్డర్లు సరఫరా అవుతున్నట్లు అంచనా. 25 వేల మందికి పైగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఇంకా వేలమంది నిరుద్యోగ యువకులు పార్ట్‌టైమ్ జాబ్‌గా దీనిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల వరకు నిరుద్యోగులకు ఒక చక్కటి ఉపాధి మార్గంగా ఉన్న ఈ యాప్‌లలో ప్రస్తుతం కోతలు మొదలయ్యాయి. స్విగ్గీలో గతంలో ఒక ఆర్డర్‌పై రూ.35 చొప్పున కమీషన్ లభించింది. ఇప్పుడు కొత్తగా ఆ యాప్‌తో అనుంధానమయ్యే వారికి రూ.15 మాత్రమే చెల్లిస్తున్నారు. ఒక రోజుకు ఆర్డర్లపైన రూ.900 లభిస్తే మరో రూ.200 ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇన్సెంటివ్‌లలో కోత విధించారు.
‘మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పని చేస్తే 15 ఆర్డర్లు అందజేయగలుగుతున్నాం. ఒకప్పుడు రూ.1300 కు పైగా ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.600 నుంచి రూ.700 దాటడడం లేదు.’’ అని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి వివిధ ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ చేస్తున్న భాస్కర్ విస్మయం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా పని చేస్తున్న తనకు ఎప్పుడు ఇంత తక్కువ ఆదాయం లభించలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. గతంలో 6 కిలోమీటర్‌లు దాటితే బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ బోనస్ నిలిపివేశారు. ‘ కమిషన్‌లను సగానికి తగ్గించిన విషయం తెలియక చాలామంది కొత్తగా వచ్చి చేరుతున్నారు. దీంతో పాత వాళ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా కొత్త వాళ్లకే ఎక్కువగా ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం.’అని రాజు అనే డెలివరీ బాయ్ అభిప్రాయపడ్డారు.
సైకిల్‌పై వస్తే తక్కువే....
మరోవైపు ఇటీవల జొమాటాలో బైక్‌లకు బదులు సైకిళ్ల పై వచ్చే డెలివరీబాయ్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఒక ఆర్డర్‌కు రూ.40 కమిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు రూ.30 కి తగ్గించారు. పైగా సైకిల్‌పై డెలివరీ చేసేవాళ్లకు రూ.20 మాత్రమే ఇస్తున్నారు. 2 నెలల క్రితం వరకు రోజుకు 18 ఆర్డర్‌లపై కమిషన్‌లు, ప్రోత్సాహకాలు కలిపి రూ.1000 సంపాదించిన శివ ఇప్పుడు రూ.700 మాత్రమే పొందగలుగుతున్నాడు. ఎల్‌బీనగర్ కేంద్రంగా అతడు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. కమిషన్‌లు, ప్రోత్సాహకాలు తగ్గడంతో డెలివరీ బాయ్స్ నగరంలో ఆందోళనకు దిగుతున్నారు. ఇటీవల కొండాపూర్, హైటెక్‌సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో డెలివరీని నిలిపివేసి సమ్మెకు దిగారు. కానీ సమ్మెకు ప్రోత్సహించారనే నెపంతో కొంతమంది ఐడీలను బ్లాక్ చేసినట్లు సమాచారం.
ఆన్‌లైన్ ఫుడ్ వెరీగుడ్...
నగరవాసి జీవితంలో ఆన్‌లైన్ ఫుడ్ ఒక భాగమైంది. బ్యాచ్‌లర్స్‌కు ఇది ఒక వరప్రదాయినిగా మారింది. ఉదయం లేచిన వెంటనే కావాల్సిన అల్పాహారం మొదలుకొని చికెన్, మటన్ బిర్యానీల వరకు ఆన్‌లైన్‌పై ఆర్డర్ చేయడం సాధారణమైంది. ఆహార సరఫరా సంస్థల గణాంకాల ప్రకారం ఉదయం అల్పాహార బుకింగ్‌లు ఎక్కువగా కార్యాలయాలకు ఉన్నాయి.
- గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి నెలా ఆర్డర్లు సుమారు : 15 లక్షలు
- స్విగ్గీ, జొమాటా,తదితర యాప్‌ల డెలివరీ బాయ్‌లు : 25వేల మందికి పైగా
- గతంలో స్విగ్గీ నుంచి ఒక ఆర్డర్‌పై లభించిన కమిషన్ రూ.35. ఇప్పుడు రూ.15
- జొమాటా నుంచి గతంలో లభించిన కమిషన్ రూ.40. ఇప్పుడు రూ.30
Comments
Please login to add a commentAdd a comment