సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: అసలే వేసవి.. ఆపై భానుడి ప్రతాపం.. సేదదీరేందుకు జనం నానా అగచాట్లు పడుతున్నారు. ఇక పది, ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కూడా సూర్యప్రతాపాన్ని తప్పించుకునేందుకు ఈతను ఆశ్రయిస్తున్నారు. అందుకోసం డ్యాంలు, చెరువులు, వ్యవసాయ బావుల్లో వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఈత రాక మృత్యవాత పడుతున్నారు. గడిచిన ఏడాది కాలంలోనే మంజీరా బ్యారేజిలో ఈత కోసం వెళ్లిన 12 మంది మృతి చెందగా, కన్నవారికి కడుపు కోత మిగిలింది. ఈ నెల 13న ఇంజనీరింగ్ విద్యార్థి అముల్‌కట్టి, ఇమ్రాన్ ఖాన్ ఈతకోసం మంజీర డ్యాంలో దిగి మృతి చెందడం జిల్లా ప్రజలను కలిచివేసింది.
రోజంతా వెతికితే గానీ మృతదేహాలు లభ్యం కాలేదు. అయితే రూ. 3 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి సంగారెడ్డి పట్టణంలో నిర్మించిన ఈత కొలను మాత్రం ప్రజలకు పనికిరాకుండా పోయింది. విద్యార్థుల నీటి మునక ఘటన అనంతరం ఈత కొలను అంశంపై స్థానికంగా విమర్శలు చెలరేగాయి. ఈ స్విమ్మింగ్ పూల్ వినియోగంలో ఉంటే వీరిలో కొందరైనా ప్రాణాలతో మిగిలేవారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. యువతను ప్రలోభాలకు గురిచేస్తున్న స్థానిక నేతలు వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.
సంతోషంలో ‘ముంచి’ ..
పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సౌకర్యార్థం రాజీవ్ నగర బాట కార్యక్రమంలో భాగంగా 2004లో అప్పటి సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సంగారెడ్డిలో రాజీవ్ స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రూ. మూడు కోట్ల నిధులను సైతం విడుదల చేశారు. దీంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు 2012లో స్విమ్మింగ్‌పూల్‌ను పూర్తి చేయడంతో ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 ఏప్రిల్‌లో ప్రారంభించారు. రాజీవ్ స్విమ్మింగ్‌పూల్ నిర్మాణంతో పట్టణ యువత సంతోషంలో మునిగిపోయారు. అయితే వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ స్విమ్మింగ్‌పూల్‌ను మున్సిపాలిటీకి అప్పగించకుండా సంవత్సరకాలంగా తాత్సారం చేస్తున్నారు. మరోవైపు మున్సిపాలిటీ అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కాంట్రాక్టరే అనధికారికంగా స్విమ్మింగ్‌పూల్‌ను నిర్వహిస్తూ వచ్చిపోయే వారి నుంచి గంటకు రూ.100 వసూలు చేస్తున్నాడు. అదికూడా తనకనువైన సమయాల్లోనే కావడంతో ఎప్పుడు చూసినా గేటుకు తాళం కనిపిస్తోంది. దీంతో రూ.3 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ స్విమ్మింగ్‌పూల్‌ను మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్‌కు అప్పనంగా బహుమతి కింద అప్పగించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసాంఘిక కార్యక్రమాలు..!
సాయంత్రం వేళలో ఈత కొలను పరిసరాల్లో అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు వివిధ శాఖలకు చెంది కొందరు అధికారులు స్విమ్మింగ్‌పూల్ వద్ద మద్యం సేవించడంతో పాటు పేకాటడుతున్నారు. వీరికి పోలీసు శాఖ చిన్నబాస్‌లు సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి నిర్మాణం పూర్తయిన స్విమ్మింగ్‌పూల్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అప్పుడే నీటి మునక మరణాలు తగ్గుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
‘కోట్లు’పెట్టి కట్టినా.. కొందరికే!
Published Fri, Apr 18 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement