సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయని ప్రభుత్వం
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 20వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయలేదని, నిధులను కేటాయించినా ఖర్చు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్‌లో ఇప్పటిదాకా ఖర్చు చేయకుండా మిగిలిన నిధులను ప్రత్యేక నిధుల కింద కేటాయించాలని డిమాండ్ చేశారు.
వచ్చే బడ్జెట్‌లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులను కేటాయించి, ఖర్చు చేయాలని ఆయన కోరారు. బడ్జెట్‌ను కేటాయింపులకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేసి, ఖర్చు చేయాలని అన్నారు. సబ్‌ప్లాన్‌కు నిధులను కేటాయించి, ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వం చీటింగ్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.