ఐఎంజీ కేసులో బాబుపై చర్యలు తీసుకోండి  | Take Actions On Chandrababu in IMG Case | Sakshi
Sakshi News home page

ఐఎంజీ కేసులో బాబుపై చర్యలు తీసుకోండి 

Published Tue, Jan 1 2019 3:01 AM | Last Updated on Tue, Jan 1 2019 3:01 AM

Take Actions On Chandrababu in IMG Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మరోసారి ఐఎంజీ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. కోట్లాది రూపాయల విలువైన భూముల్ని అప్పటి ఉమ్మడి ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కట్టబెట్టారని, ఈ వ్యవహారంలో చంద్రబాబు, కంపెనీపై ప్రాసిక్యూషన్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీకి న్యాయవాది ఇమ్మనేని రామారావు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఐఎంజీ పేరిట కాగితాలకే పరిమితమైన కంపెనీకి సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన భూములుసహా 850 ఎకరాలు కారుచౌకగా ఇచ్చారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని కోట్లాది రూపాయల విలువైన 850 ఎకరాలను ఐఎంజీ–భరత కంపెనీకి ఇవ్వడం వెనుక కుట్ర, మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు కీలక పాత్రధారి అయిన అప్పటి ఉమ్మడి ఏపీ ఆపద్ధర్మ సీఎం, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు తనకు సన్నిహితుడైన అహోబిలరావు (బిల్లీరావు), ఆయన సోదరుడు ప్రభాకరరావు(ప్యాట్రో)లకు చెందిన ఐఎంజీబీ కంపెనీకి అప్పనంగా భూములు రిజిస్ట్రేషన్‌ చేయించారని వివరించారు. భూముల రిజిస్ట్రేషన్లకు కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందని, చంద్రబాబు బినామీ కంపెనీలకు భూములు ఇచ్చారని, ఇందుకు కారణమైన ఆ ముగ్గురిని ప్రాసిక్యూట్‌ చేయాలని కోరారు. కేవలం 8 రోజుల కంపెనీకి, రూ.5 లక్షల షేర్‌ క్యాపిటల్‌ ఉన్న కంపెనీకి కోట్లాది రూపాయల హైదరాబాద్‌ భూముల్ని ఇచ్చేసే కుట్రకు కారణమైనవారిని వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు.     

ఆ ఇద్దరూ చంద్రబాబుకు సన్నిహితులు 
ఆగస్టు 5వ తేదీ 2003లో ఐఎంజీబీని రిజిస్ట్రేషన్‌ చేశారని, అప్పుడు షేర్‌ క్యాపిటల్‌ కేవలం రూ.5 లక్షలు మాత్రమేనని, ఈ కంపెనీ అధిపతులుగా చెప్పుకునే బిల్లీరావ్, ప్యాట్రోలు ఇద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులని ఇమ్మనేని తెలిపారు. క్రీడలకు చెందిన అంతర్జాతీయ కంపెనీ ఐఎంజీకి అనుబంధ కంపెనీగా ఐఎంజీబీని పేర్కొన్నారని, నిజానికి ఐఎంజీకి ఐఎంజీబీలకు ఏమాత్రం సంబంధం లేదని, ఇదే విషయాన్ని ఫ్లోరిడాలో ఉండే ఐఎంజీ వెల్లడిం చిందని తెలిపారు. తప్పుడు పత్రాలు, ఫోర్జరీలతో మోసం చేసిన ఆ చంద్రబాబు, బిల్లీరావు, ప్యాట్రోలను విచారించాలని, వీరిపై ఐపీసీలోని 420, 406, 408, 468,471, 120 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 82, 83 సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అధికారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాల్లో రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని, అందుకు అనుగుణంగా ఐఎంజీబీ పేరిట రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారులు చేసిన 850 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఇమ్మనేని తన వినతిపత్రంలో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement