మెట్రోలతో పోలిస్తే తీసికట్టు
- ఆశాజనకంగా లేని ‘గ్రేటర్’ పోలింగ్
- చర్చనీయాంశమైన సిటీజనుల తీరు
సాక్షి, సిటీబ్యూరో : ‘ఓటుహక్కు వినియోగించుకోండి’ అంటూ ప్రజాసంఘాలు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు.. చివరికి ఎన్నికల సంఘం నెత్తీ నోరూ మొత్తుకున్నా గ్రేటర్‌లో ఓటింగ్ రవ్వంత కూడా పెరగలేదు. 2009 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం ఇంకా తగ్గింది. విస్తృత ప్రచారం జరిగినా ఓటేయడానికి కదలని సిటీజనుల తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై తదితర మెట్రో నగరాలతో పోల్చినా నగరంలోనే తక్కువ శాతం పోలింగ్ నమోదైంది.
మెట్రోల్లో మెరుగైన పోలింగ్ శాతం
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో అత్యధికంగా 64 శాతం పోలింగ్ నమోదవడంతో మెట్రో నగరాలకేఈ మహా నగరం ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత ద్వితీయస్థానంలో నిలిచిన కోల్‌కతాలో 62.25 శాతం పోలింగ్ నమోదైంది. తృతీయస్థానంలో నిలిచిన చెన్నైలో 60.9 శాతం, నాలుగోస్థానంలో నిలిచిన బెంగళూరు, ముంబై నగరాల్లో 54 శాతం మేర పోలింగ్ నమోదయ్యింది. నగరం మాత్రం 53.38 శాతానికే పరిమితమైంది. 2009 ఎన్నికల్లో గ్రేటర్‌లో 54.31 శాతం మేర పోలింగ్ నమోదైంది.
మెట్రోల్లో పోలింగ్ పెంచిన అంశాలివీ...
ఓటరు చైతన్యం పెంచేందుకు ఆయా నగరాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
బస్తీలకు సమీపంలో బూత్‌లను కేటాయించింది.
ఓటరు స్లిప్పులను సకాలంలో పంపిణీ చేశాయి.
ఓటరు స్లిప్పులు లేనివారు సైతం ఈసీ ధ్రువీకరించిన 11 ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి ఉంటే ఓటు వేయవచ్చన్న ప్రచారం విస్తృతంగా సాగింది.
సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఓటు హక్కుపై విస్తృత ప్రచారం జరగడంతో ఓటర్లలో చైతన్యం పెరిగింది.
‘గ్రేటర్’ పోలింగ్ తగ్గడానికి కారణాలివీ...
18-35 ఏళ్ల వయస్కులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
సెలవు దినం కావడంతో ఇతర వ్యాపకాలలో పడ్డారు.
ప్రచార హోరు పెరగడంతో ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయాలో తేల్చుకోలేక అయోమయానికి గురయ్యారు.
జీహెచ్‌ఎంసీ యంత్రాంగం పోలింగ్‌చీటీలు సరిగా పంపిణీ చేయలేకపోయింది.
పోలింగ్ బూత్‌ల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. చాలామంది బూత్ ఎక్కడో తెలుసుకోలేకపోయారు.
కొందరు తమ నివాసానికి పోలింగ్ బూత్ దూరంగా ఉండటంతో నిర్లిప్తత వహించారు.
అపార్ట్‌మెంట్ వాసులు తమ సమస్యల పరిష్కారానికి రాజకీయ నాయకులు ఉపయోగపడరన్న అభిప్రాయంతో ఉండడం గమనార్హం.
తక్షణం తమ సమస్యల పరిష్కారానికి అధికారులను సంప్రదిస్తే చాలన్న ధోరణి పెరిగింది.
పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలు కాలనీలు, బస్తీల్లో అసలు ప్రచారమే (పూర్ క్యాంపెయినింగ్) చేయలేదు. ప్రచార బాధ్యతలను ద్వితీయశ్రేణి నాయకగణం, కార్యకర్తలపైనే నెట్టివేశారు. దీంతో మొక్కుబడిగా ప్రచారం సాగింది.
స్థానిక సమస్యల పరిష్కారానికి అభ్యర్థులు నిర్దిష్టమైన హామీలను మేనిఫెస్టోలో పేర్కొనలేదు
జాబితాలో తమ పేరు లేదేమోనన్న ఆందోళనతో చాలామంది పోలింగ్ బూత్‌ల ముఖం చూడలేదు.
ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు వెళ్లిన పలువురు జాబితాలో పేరు లేక తిరుగుముఖం పట్టారు.
గంటల తరబడి పోలింగ్ స్టేషన్ల వద్ద పడిగాపులు పడితే వేసవి తాపానికి గురవుతామని పలువురు ఆందోళన చెందారు.