సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది.
విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి.
2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ గ్రిడ్స్‌పైనా ఉగ్రవాదం గురి
లద్దాక్‌లోని విద్యుత్ గ్రిడ్‌లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసింది.
అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్‌ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది.
రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం
సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు.
దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్‌తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి.
అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్‌తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్‌ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment