- వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అశ్వారావుపేట: ‘తెలంగాణ రాష్ర్టంలోని అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ప్రసక్తే లేదు. అలాంటి చర్యలకు పాల్పడితే తెలంగాణ బిడ్డగా పోరాటం చేస్తాను’ అని వైఎస్సార్‌సీపీ రాష్ర్ట అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అశ్వారావుపేట మండలంలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు.
మండల పరిధిలోని నారంవారిగూడెం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా అశ్వారావుపేట మండలాన్ని ఆంధ్రలో కలుపుతున్నట్లు ఊహాగానాలు, ప్రచారం జరుగుతోందన్నారు. దీనిపై స్థానికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవ సరం లేదన్నారు. ఇదంతా దుష్ర్పచారం మాత్రమే అన్నారు. ఒకసారి విభజన జరిగిన తర్వత దాన్ని మార్చడం గాని, కొత్తగా చేర్పులు మార్పులు చేయడం ఉండవన్నారు. ఒకవేళ ఈ మండలాన్ని ఆంధ్రలో కలిపే ప్రయత్నాలు సాగితే మాత్రం తెలంగాణ బిడ్డగా ముందుండి ఉద్యమం చేస్తానన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
రైతుల మేలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఈసీ మెంబర్ జూపల్లి రమేష్, మండల కన్వీనర్ పుచ్చకాయల రాజశేఖర్‌రెడ్డి, జూపల్లి ప్రమోద్, కొల్లి సత్యనారాయణ, గేదెల సురేష్, సర్పంచ్ బెల్లం సుజాత, తహశీల్దార్ గంగా భవానీ, పంచాయతీ రాజ్ ఏఈఈ సుబ్బారావు, ట్రాన్స్ కో ఏఈఈ రామారావు, ఐటీడీఏ ఏఈఈ మహేష్, ఆర్‌ఐలు శ్రీనివాస్‌యాదవ్, శివకృష్ణ పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన అచ్యుతాపురంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.