
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకున్న హైదరాబాద్ మెట్రో రైలు దేశంలోనే నంబర్ 1గా నిలుస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మెట్రో రైలును పట్టాలెక్కించి, ప్రజలకు అత్యాధునిక రవాణా వ్యవస్థను అందించిన ఘనత ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మెట్రో రైలు సాధనలో కాంగ్రెస్ పార్టీ కృషి శూన్యమని, ఆ పార్టీ దిగజారుడు మాటలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
సోమవారం తలసాని సచివాలయంలో మాట్లాడుతూ.. నాడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మెట్రో రైలును పెద్దగా పట్టించుకోలేదని, కేవలం 24 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయని, అవి కూడా అసంపూర్తిగానే చేశారని విరుచుకుపడ్డారు. ఆర్మీ, రైల్వేశాఖలకు చెందిన స్థలాల సేకరణ విషయంలో రక్షణమంత్రి అరుణజైట్లీ, రైల్వేమంత్రి సురేశ్ ప్రభులతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపి 2.15 ఎకరాల భూమిని బదలాయింపు ద్వారా, 3.65 ఎకరాలు లీజు ద్వారా మెట్రో నిర్మాణం కోసం సేకరించి ఇచ్చారని తెలిపారు. మెట్రో విషయంలో కోర్టుల్లో దాఖలైన 115 కేసుల పరిష్కారంకోసం ప్రభుత్వం ఎంతో శ్రమించిందని, ప్రాజెక్టు నిర్మాణంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ కృషి కూడా ఎంతో ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment