
తెలుగు నేర్చుకుంటున్నానని, తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.
సాక్షి, చెన్నై: తెలుగు నేర్చుకుంటున్నానని, తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ఆదివారం టీనగర్‌లోని సర్‌పిట్టి త్యాగరాయ హాల్ వేదికగా ఆమె సత్కార వేడుక జరిగింది. తమ రాష్ట్రానికి చెందిన మహిళా నాయకురాలికి ఇంత పెద్ద పదవి దక్కడంతో తమిళిసైని సత్కరించుకోవాలని చెన్నై పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి డీఎండీఎంకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, పీఎంకే నేత జీకే మణి, తమిళ మానిల కాంగ్రెస్ నేత జ్ఞానదేశికన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమలత, శరత్‌కుమార్, జీకే మణి, జ్ఞానదేశికన్ మాట్లాడుతూ కఠిన శ్రమకు గుర్తింపుగా ఆమెను గవర్నర్ పదవి వరించినట్లు కొనియాడారు.
ఆమెలోని ధైర్యం, వాక్ చాతుర్యాన్ని వారు గుర్తు చేశారు. అనంతరం తమిళిసై ప్రసంగిస్తూ తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లు సైతం ఇప్పుడు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తున్నారని, ఇది ప్రొటోకాల్ ధర్మంగా ఉన్నా, ఇది ఒకరకంగా ఇబ్బందికి గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడున్నా, తమిళి సై అని, ఇక్కడి వారి అభిమానం, ఆప్యాయతల మధ్య మెలిగానని, ఇది తన మీద చూపిస్తే మరింత ఆనందంగా ఉంటుందని అన్నారు. దేవుడు ఇచి్చన వరం, ప్రధాని నరేంద్ర మోదీ ఇచి్చన ఈ పదవితో, తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నానని వివరించారు.