విడిపోయిన ఉమా, మోత్కుపల్లి వర్గాలు | TDP leaders Internal Fight in District president post | Sakshi
Sakshi News home page

విడిపోయిన ఉమా, మోత్కుపల్లి వర్గాలు

Published Sun, May 17 2015 12:23 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

విడిపోయిన ఉమా, మోత్కుపల్లి వర్గాలు - Sakshi

విడిపోయిన ఉమా, మోత్కుపల్లి వర్గాలు

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అదే పట్టు.. అదే పంతం... తమ వారికే పట్టం కట్టాలంటే .. తమ వారికే పగ్గాలివ్వాలని రెండు వర్గాల వాదనలు... ఎట్టి పరిస్థితుల్లో పాత అధ్యక్షుడిని తప్పించాలని ఒకరు.. ఇప్పుడెందుకు తప్పించడం, కొనసాగించాలని మరొకరు... నియోజకవర్గ ఇన్‌చార్జులది ఒక మాట... మండల పార్టీ నాయకులది మరో మాట... కొందరు ఉంచాలంటారు.. మరికొందరు తీసేయాలంటారు.. తమ నాయకుడికే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కార్యకర్తల నినాదాలు... వద్దు వద్దు.. నినాదాలు చేయవద్దని సర్దుబాటు చేసే యత్నాలు... మాట్లాడుకుందాంరండని నియోజకవర్గాల వారీగా నేతలతో హైదరాబాద్ నుంచి వచ్చిన పరిశీలకుల మంతనాలు.. అక్కడా కుదరని ఏకాభిప్రాయం..
 
  చివరకు నిర్ణయాధికార బంతి పార్టీ అధినేత చంద్రబాబు కోర్టులోకి... స్థూలంగా ఇదీ జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం శనివారం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగిన తీరు... ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి వర్గాలుగా రెండు గ్రూపులుగా చీలిపోయిన పార్టీ నేతలు జిల్లా అధ్యక్ష పదవిని తమ గ్రూపుకివ్వాలంటే తమ గ్రూపుకివ్వాలని పరిశీలకుల వద్ద పట్టుబట్టడంతో ఏమీ తేల్చకుండానే పరిశీలకులు వెళ్లిపో వాల్సి వచ్చింది. బిల్యాను ఉంచాల్సిందేనని మోత్కుపల్లి  నర్సింహులు వర్గం... ఆయనను తప్పించాలని ఉమా మాధవరెడ్డి వర్గం భీష్మించడంతో చంద్రబాబుకు మీ అభిప్రాయాలు చెబుతామని, ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పి సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు.
 
 విడివిడి భేటీలు.. వేర్వేరు అభిప్రాయాలు
 పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా నాయకులంతా శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సీతక్కలు పార్టీ నుంచి పరిశీలకులుగా హాజరయ్యారు. జిల్లాకు చెందిన  పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గాల ఇంచార్జులు, మండల, గ్రామ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా పార్టీ నేతల ప్రసంగాలు అయిపోయిన తర్వాత పరిశీలకులు నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నాయకులు మండలాల వారీగా తమ అభిప్రాయాలను చెప్పారు. నియోజకవర్గాల ఇన్‌చార్జులతో పాటు మండల, మున్సిపల్ అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలనే దానిపై అభిప్రాయాలు వెలిబుచ్చారు.
 
  అందులో సూర్యాపేట, ఆలేరు, దేవరకొండ, కోదాడ నియోజకవర్గాల ఇన్‌చార్జులు బిల్యానాయక్‌ను కొనసాగించాలని చెప్పగా, మిగిలిన నియోజకవర్గాల నేతలు మాత్రం బిల్యాను తప్పించాలని కొందరు, ఉమా మాధవరెడ్డి చెప్పిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని మరికొందరు నేతలు చెప్పుకొచ్చారు. ఇక నియోజకవర్గాల ఇన్‌చార్జుల మాట అటుంచితే, మండల పార్టీల నేతలు కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పారు. కొందరు కంచర్ల భూపాల్‌రెడ్డి పేరు, మరికొందరు బిల్యానాయక్ పేరు చెప్పగా, ఇంకొందరు తటస్థంగా ఉంటామని, మరికొందరు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇష్టమేనని చెప్పినట్టు తెలిసింది. అయితే, నియోజకవర్గ ఇన్‌చార్జుల అభిప్రాయంతో కూడా కొందరు మండల పార్టీల నేతలు విభేదించి వేరే పేర్లు చెప్పడంతో ఏం చేయాలో పరిశీలకులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
 
 ఆ తర్వాత ఉమా మాధవరెడ్డితో కలిసి స్వామిగౌడ్, కాశీనాథ్, రజనీ కుమారి, బంటు వెంకటేశ్వర్లు, నెల్లూరి దుర్గాప్రసాద్, కంచర్ల భూపాల్‌రెడ్డి, సందీప్‌రెడ్డి తదితరులు పరిశీలకులతో సమావేశమయ్యారు. బిల్యాను తప్పించాల్సిందేనని, ఎవరిని అధ్యక్ష పదవిలో ఉంచాలన్నది తర్వాత వెల్లడిస్తామని వారు పరిశీలకులతో చెప్పినట్టు సమాచారం. మోత్కుపల్లి వర్గం తరఫున పటేల్ రమేశ్‌రెడ్డి, శోభారాణి, బిల్యానాయక్, బొల్లం మల్లయ్య యాదవ్, మాదగోని శ్రీనివాసగౌడ్, అయిలయ్య యాదవ్‌లు కూడా పరిశీలకులను కలిసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అధ్యక్షుడిగా బిల్యాను ఉంచాలని, ప్రధాన కార్యదర్శిగా అయిలయ్య యాదవ్‌ను ఎన్నుకోవాలని సూచించారు. వీరి వాదనలు విన్న పరిశీలకులు అందరి అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబుకు వివరిస్తామని, ఆయన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
 
 కంచర్ల లేదా బిల్యాలలో ఒకరికి ఛాన్స్
 మొత్తంమీద ఏకాభిప్రాయం... కాదు కాదు కనీసం నియోజకవర్గం మొత్తంమీద ఒకేమాట చెప్పే పరిస్థితి లేకుండా ముగిసిన సమావేశం జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను మిగిల్చింది. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం కోసం అందరూ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో కంచర్ల భూపాల్‌రెడ్డి, బిల్యానాయక్‌లలో ఒకరికి అవకాశం ఉంటుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నాయి. అయితే, వీరిద్దరూ పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జుల హోదాలో ఉన్నందున రెండు సార్లు పార్టీ ప్రధాన కార్యద ర్శిగా పనిచేసిన నెల్లూరు దుర్గాప్రసాద్ పేరును కూడా ఉమా మాధవరెడ్డి ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేదంటే మరో నేత పేరయినా అమె చెప్పవచ్చని తెలుస్తోంది. మోత్కుపల్లి వర్గం మాత్రం బిల్యాను తప్పించాలంటే పటేల్ రమేశ్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టనుంది. లేదంటే బొల్లం మల్లయ్య, శ్రీనివాస్‌గౌడ్‌ల పేర్లను కూడా తెరపైకి తేనున్నట్టు సమాచారం. జిల్లా పార్టీ అధ్యక్షపదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు జిల్లా టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.
 
 ఆద్యంతం... అభిప్రాయ భేదాలు
 ఈ సమావేశంలో మాట్లాడిన నేతలంతా మాటల తూటాలు పేల్చారు. అందరం కలిసి పనిచేద్దామంటూనే కయ్యాలకు కాలుదువ్వే వ్యాఖ్యలు చేశారు. గ్రూపు గొడవలు మానేయాలని, అందరం పార్టీని కుటుంబంగా భావించి పనిచేయాలని చెప్పిన నాయకులే... తెలుగుదేశం పార్టీ ఓటమికి వేరే పార్టీలేవీ కారణం కాదని, సొంత పార్టీలోని నేతల కారణంగానే పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికయినా విభేదాలు వీడకపోతే పార్టీ అభివృద్ధి చెందదని కొందరు చెపితే... మరికొందరేమో తమకు ఫలానా వారితో విభేదాలున్నాయని బహిరంగంగానే చెప్పడం గమనార్హం.
 
 ఒక నాయకుడు మాట్లాడుతూ తమకు పదవి కావాలంటే తమకు కావాలని పట్టుపట్టడం మంచిది కాదని, పార్టీ అధినేత నిర్ణయం మేరకు నడుచుకోవాలని చెపితే, మరొక నాయకుడు మాట్లాడుతూ తనకు పదవిని నిర్వహించే సత్తా ఉందని, ఒకసారి నాకు అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించడం గమనార్హం. చివరకు ఒక నేత మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం తాను అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించడం ఆ పార్టీలోని వర్గవిభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అయి తే, జిల్లా పార్టీ సమావేశానికి పార్టీ కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు గైర్హాజరు కావడం చర్చనీయాంశమయింది. బంధువు లు చనిపోయిన కారణంగా మోత్కుపల్లి స మావేశానికి రాలేదని ఆయన వర్గీయులు చె పితే, కావాలనే సమావేశానికి దూరంగా ఉ న్నా రని కొందరువ్యాఖ్యానించడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement