12న టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక
బిల్యాను తప్పించాలని ఉమామాధవరెడ్డి వర్గీయుల పట్టు
ప్రస్తుత అధ్యక్షుడికి అండగా మోత్కుపల్లి
రమేశ్‌రాథోడ్ రూపంలో బిల్యానాయక్‌కు పదవీగండం!
తనకే మళ్లీ అధ్యక్ష పదవి దక్కుతుందన్న ధీమాలో బిల్యా
అధినేత బాబు నిర్ణయం కోసం ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రూపు తగాదాలు, మాటల తూటాలకు పుట్టినిల్లయిన జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన సారథి ఎవరనే అంశంలో లొల్లి మొదలైంది. ఈనెల 12వ తేదీన జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు బిల్యానాయక్‌నే పదవిలో కొనసాగిస్తారా? లేక కొత్త నేతను ఎంపిక చేస్తారా అనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే, సామాజిక వర్గాల కోటాలో ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్‌ను పదవి నుంచి తప్పిస్తారనే చర్చ జరుగుతోంది.
ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాజీ పార్లమెంటు సభ్యుడు రమేశ్‌రాథోడ్‌కు అప్పగించాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారని, అదే జరిగితే రాథోడ్ సామాజిక వర్గానికే చెందిన బిల్యానాయక్‌ను తప్పించవచ్చనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఉమామాధవరెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు ఆయనను తప్పించాల్సిందేనని అంటుండగా, మోత్కుపల్లి మాత్రం బిల్యానే కొనసాగించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందనేది ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది.
బిల్యాకు సమాన అవకాశాలు
సామాజిక వర్గాల కోటాలో బిల్యానాయక్‌ను పదవి నుంచి తప్పిస్తారనే చర్చ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థాయిలో జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత మళ్లీ నల్లగొండ జిల్లాలో అదే సామాజిక వర్గానికి బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని పార్టీ నాయకులంటున్నారు. అయితే, జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న ఉమామాధవరెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఆమె ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చకపోయినా, ఆమె వర్గంలో ఉన్న నాయకులు మాత్రం బిల్యాను తప్పించాలని, అవసరమైతే ఎస్టీ సామాజిక వర్గంలోనే మరో వ్యక్తికి ఇవ్వాలి తప్ప బిల్యాకు వద్దని అంటున్నారు.
దీనికి మోత్కుపల్లి మాత్రం ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్యాను కొనసాగించాల్సిందేనని ఆయన అధినేత చంద్రబాబు వద్ద స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నేతల కొట్లాట ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది. కాగా, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి వర్గాల మధ్య గొడవలు కూడా బిల్యాకు సానుకూలంగా మారుతాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ బిల్యాను తప్పించాలనుకుంటే ఏకగ్రీవంగా మరొకరి పేరు సూచించే పరిస్థితి జిల్లా పార్టీలో లేదు.
అది ఎస్టీ సామాజిక వర్గమైనా, మరే ఇతర సామాజిక వర్గమైనా ఒక్క నాయకుడి పేరు మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బిల్యా మాత్రం తనకే మళ్లీ అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు తనను పిలిచి పదవి ఇచ్చారని, ఇప్పుడే అదే జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీకి వెళ్లనని, ఏకగ్రీవంగా ఇస్తేనే పదవిని తీసుకుంటానని ఆయన సన్నిహితుల వద్ద అంటున్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గాల సమావేశాల్లో జాప్యం
వాస్తవానికి జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నికల నాటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ ఎక్కడా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో 12వ తేదీనాటికే ఈ సమావేశాలన్నీ పూర్తవుతాయా అనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అధ్యక్ష పదవికి 12వ తేదీన ఎన్నిక జరగాలని, జిల్లా మినీ మహానాడు ఈనెల 18న నిర్వహించాలని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గాల సమావేశాలన్నీ పూర్తవుతాయని, 12న జిల్లా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని జిల్లా టీడీపీ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
తమ్ముళ్ల తగువులు ఏమవుతాయో?
జిల్లాలో తెలుగుదేశం పార్టీ మోత్కుపల్లి నర్సింహులు, ఉమామాధవరెడ్డి గ్రూపులుగా పార్టీ నేతలు విడిపోయారు. గత ఎన్నికలకు ముందు ఇరువర్గాలు ఢీఅంటే ఢీ అనగా, ఎన్నికల అనంతరం మోత్కుపల్లి శిబిరంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్‌తో పాటు ఇతర నేతలంతా ఉమామాధవరెడ్డి పక్షాన చేరారు. సూర్యాపేట నియోజకవర్గ నాయకుడు పటేల్మ్రేశ్‌రెడ్డి మాత్రం మోత్కుపల్లి వెంటే ఉన్నారు. గత ఎన్నికలలో మోత్కుపల్లి కూడా జిల్లా నుంచి వలస వెళ్లి ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓడిపోయారు.
దీంతో పార్టీ నేతలంతా ఆయనపై తిరుగుబాటే ప్రకటించారు. జిల్లాలో కీలకంగా ఉన్న నాయకుడే జిల్లా వదిలి వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమయిందనే భావనలో కొందరు నేతలున్నారు. అసలు జిల్లాతో మోత్కుపల్లికి సంబంధమే లేదనే స్థాయిలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంలో గుంభనంగా వ్యవహరించిన మోత్కుపల్లి అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడితో జిల్లా పార్టీలో తన హవాను కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిల్యాను మార్చి వేరే నేతను ఎంపిక చేయాలనుకుంటే ఏ సామాజిక వర్గమైన గొడవలు జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పటికే వలసలు ఎక్కువయి డీలా పడిపోయిన పార్టీకి త్వరలోనే జరగనున్న జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక ఎలాంటి కష్టాలు తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే.
తెలుగు తమ్ముళ్ల ‘అధ్యక్ష’ లొల్లి
Published Wed, May 6 2015 12:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement