సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. 2017లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ ఈ నెల 22, 27వ తేదీల్లో నోటీసులు జారీ చేసిందని సుజనా పిటిషన్‌లో పేర్కొన్నారు. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీ అధికారులతోగానీ తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ కంపెనీలో తాను వాటాదారు కాదని, డైరెక్టర్ కూడా కాదన్నారు. ఆ కంపెనీపై నమోదు చేసిన కేసులో తనను హాజరు కావాలని సీబీఐ ఎందుకు నోటీసులు జారీ చేసిందో అర్థం కావట్లేదన్నారు.
ఈ నోటీసుల ద్వారానే తనకు బెస్ట్ అండ్ క్రాంప్టన్‌తోపాటు మరికొందరు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందని పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తప్పుడు ఖాతాలతో తరలించారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. కేవలం ఖాతా పుస్తకాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు చూపి బ్యాంకులను రూ. 72 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయని సుజనా ఆరోపించారు. ఆ కంపెనీతో తనకు సంబంధం లేదని చెప్పినా సీబీఐ తనకు మరో నోటీసు పంపిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరారు.
సీబీఐ నోటీసులపై హైకోర్టుకు సుజనా
Published Tue, Apr 30 2019 1:16 AM | Last Updated on Tue, Apr 30 2019 1:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment