సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తమ ముందు హాజరుకావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను గౌరవించి తీరాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సీబీఐ నిర్దేశించిన మే 4న కాకుండా మే 27, 28 తేదీల్లో సీబీఐ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు బెంగళూరులోని సీబీఐ అధికారుల ముందు హాజరు కావాలని పేర్కొంది. ఆ రెండు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. అధికారుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని సుజనాకు స్పష్టం చేసింది.
విచారణ సమయంలో న్యాయవాది వెంట ఉంచుకోవచ్చని పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద విచారణ పేరుతో సుజనా చౌదరిని అరెస్ట్ చేయడం గానీ, శారీరకగా, మానసికంగా వేధింపులకు గానీ గురిచేయొద్దని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. సీబీఐ తనకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ విచారణ జరిపారు.
ప్రాథమిక ఆధారాలున్నాయి..
సీబీఐ న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపిస్తూ, సీఆర్‌పీసీ సెక్షన్160, 161 కింద నోటీసులు ఇచ్చినప్పుడు, విచారణను ఎదుర్కోవడానికి నిరాకరించడానికి వీల్లేదన్నారు. తాము సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జరుపుతున్న విచారణ కాదన్నారు. సుజనా గ్రూపు కంపెనీల వ్యవహారాలకు సంబంధిం చిదర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగితాలపైనే లావాదేవీలు చూపినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. అందుకే పిటిషనర్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ దశలో ఈ కేసు పూర్వాపరాల గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయట్లేదన్నారు. సీబీఐ చెప్పిన మే 4న కాకుండా, ఈ నెల 27, 28 తేదీల్లో ఆ సంస్థ ముందు హాజరు కావాలని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
సంబంధం లేదు..
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్టెక్ట్స్ కంపెనీకి కానీ, ఆ కంపెనీ అధికారులతో కానీ సుజనా చౌదరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు ఇచ్చిన నోటీసులకు సంబంధించి సీబీఐని పిటిషనర్ మరింత సమాచారం, అలాగే ఎఫ్‌ఐఆర్ కాపీ కోరుతూ లేఖ రాశారన్నారు. అయితే సీబీఐ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఎన్నికల దృష్ట్యా మే 19వ తేదీ వరకు అందుబాటులో ఉండలేనని సీబీఐకి చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment