జవాబు చెప్పలేదని చితకబాదిన ఉపాధ్యాయుడు
రాయికోడ్ : ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటూ ఓ విద్యార్థినిని ఉపాధ్యాయుడు చితకబాది గాయపరచిన సంఘటన మండలంలోని చిమ్నాపూర్‌లోని ప్రైవేటు పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. విద్యార్థి మేనమామ బసప్ప కథనం మేరకు.. న్యాల్‌కల్ మండలంలోని హద్నూర్ గ్రామానికి చెందిన శ్రీను కుమారుడు నరసింహులు మండలంలోని కుసునూర్ గ్రామంలోని తన మేనమామ బసప్ప వద్ద ఉంటూ, చిమ్నాపూర్ గ్రామ శివారులోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుకుంటున్నాడు. సోమవారం రోజు లాగానే పాఠశాలకు వెళ్లాడు.
ఈ క్రమంలో తరగతి గదిలో పాఠాన్ని భోధించడానికి వచ్చిన ఉపాధ్యాయుడు నాగరాజు.. నరసింహులును ఓ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడిగాడు. అయితే నరసింహులు సమాధానం చెప్పలేకపోవడంతో ఉపాధ్యాయుడు నాగరాజు అతడిని చితకబాదాడు. వీపు భాగంలో రక్తం చిమ్మేలా వాటర్‌ై పెపుతో కొట్టాడని విద్యార్థి మేనమామ ఆరోపించాడు. ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తించడంతో నరసింహులు వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి పట్ల పైశాచికంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు నాగరాజుపై చర్యలు తీసుకోవాలని బసప్ప అధికారులను కోరాడు.