విపక్షాల నిరసన, అసెంబ్లీ రెండుసార్లు వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల నిరసనల మధ్య శాసనసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే రెండుసార్లు పది నిమిషాల పాటు వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు రైతుల ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టాయి. చర్చ జరపాలంటూ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
అయితే బీఏసీ సమావేశం నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాతే వాయిదా తీర్మానాలపై చర్చిద్దామని స్పీకర్ మధుసుదనా చారి సూచించినా, విపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభను స్పీకర్ పదినిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష సభ్యులు పట్టువీడకపోవటంతో స్పీకర్ మరోసారి సభను పది నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.