రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ | telangana assembly discuss on farmers suicides | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలపై దద్దరిల్లిన సభ

Published Tue, Nov 11 2014 1:55 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

సభలో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి - Sakshi

సభలో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

 పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రైతులను కాపాడే బాధ్యత తమపై ఉందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారపక్షం పేర్కొంటే.. విద్యుత్తుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, రైతులకు మద్దతు ధర ఇప్పించకుండా వారిని కష్టాల్లోకి నెడుతోందని విపక్షాలు విమర్శలకు దిగాయి. సోమవారం అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై వాడివేడిగా చర్చ సాగింది. పత్తి, మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలు ఇప్పించడంలో, కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని టీడీపీ శాసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కేంద్రంతో, సీసీఐ చైర ్మన్‌తో మాట్లాడలేదని, విద్యుత్ విషయంలో కేంద్రమంత్రిని అడగలేదని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీటుగా స్పందించారు. రైతు సంక్షేమం కోసం, వారిని ఆదుకునేందుకు ఈ అంశంపై చర్చిస్తున్నామని, తొందరపడవద్దని సూచించారు. ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎర్రబెల్లి అనగా.. ఈ దిక్కుమాలిన పరిస్థితిని రైతులకు కల్పించిందే టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలేనంటూ ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాను ఎదురుదాడి చేశానని ఎర్రబెల్లి అన్నారని, అదే ం సంస్కారమని ప్రశ్నించారు. ‘ఆ పార్టీలో ఉండటమే మీ ఖర్మ’ అంటూ దుయ్యబట్టారు. దాడి చేశారన్న పదాన్ని రికార్డులోంచి తొలగించాలని కోరారు. రైతు బిడ్డగా వారి కష్టాలు తనకు తెలుసునని దయాకర్‌రావు పేర్కొనగా.. ‘నీవు రైతు బిడ్డవు అయితే నేను డెరైక్టుగా రైతును’ అని సీఎం అన్నారు. ఇందుకు ‘నేను ఫామ్‌హౌస్ రైతును కాదు’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో బోర్లు వేయడం వల్ల పరిసర గ్రామాల్లో నీళ్లు లేకుండా పోయాయని, ఆ బోర్లు ఎవరు వేశారో అని ఎర్రబెల్లి అన్నారు. ఇందుకు మంత్రి ఈటెల కల్పించుకొని.. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని మండిపడ్డారు. దయాకర్‌రావు మాట్లాడుతున్న సమయంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటెల మధ్యలో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తనను అడ్డుకుంటున్నారని దయాకర్‌రావు అభ్యంతరం తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులు పలుమార్లు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
 
 సర్కారు విఫలం: జీవన్‌రెడ్డి
 
 రుణాలు మాఫీ చేయటంలో రాష్ట్ర సర్కారు మీనమేషాలు లెక్కించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెట్టుబడులు కరువై, దిక్కుతోచక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈ అయిదు నెలల వ్యవధిలోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లోనే 76 మంది చనిపోయారని.. గజ్వేలు నియోజకవర్గంలో 19 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై జరిగిన చర్చలో ఎర్రబెల్లికి ముందు జీవన్‌రెడ్డి ప్రసంగించారు. రైతు రుణాలు మాఫీ చేయటంలో సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. ‘‘రూ.19 వేల కోట్లు మాఫీ చేస్తామని ఈ ప్రభుత్వమే చెప్పింది. 17 వేల కోట్లు మాఫీ చేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఖరీఫ్ పెట్టుబడుల సమయంలో పట్టించుకోకుండా సెప్టెంబర్ 28న రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రైతులు వడ్డీ వ్యాపారులు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకున్నారు. 36 లక్షల మందికి రుణాలివ్వాల్సి ఉంటే.. 19 లక్షల మందికే రుణాలు పంపిణీ చేశారు. అక్టోబరు 15 వరకు కేవలం 8 వేల కోట్లు పంపిణీ చేశారు. ఇవన్నీ సర్కారు చెప్పిన లెక్కలే ’’ అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు వ్యవసాయానికి తొమ్మిది గంటలు సరఫరా చేస్తే ఇప్పుడు మూడు నాలుగు గంటలకు మించి రావటం లేదని దుయ్యబట్టారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వారం రోజులైనా పట్టించుకోవటం లేదన్నారు. ఇందుకు మంత్రి హరీశ్ స్పందిస్తూ... ‘నిరాధారమైరన అంభాడాలు వేయటం సరికాదు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతు చేస్తున్నాం...’ అని అన్నారు.  ‘‘వర్షాభావం.. పంటలు ఎండిపోతున్నాయంటూ ఒక పార్టీ బస్సుయాత్ర చేసింది. ఇప్పుడు మార్కెట్లో ధరలు రావటం లేదంటూ మళ్లీ అదే పార్టీ మాట్లాడుతోంది.. అసలేం మాటలో ఏమో.. వాళ్లది నాలుకా.. తాటిమట్టనా..’’ అని హరీశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ‘‘అసలేం మాట్లాడుతున్నారు.. ఎదురుదాడి చేస్తున్నారా..? అవేం మాటలు..  సభా మర్యాదలు పాటించాలి’’ అంటూ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్ముల్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని హరీష్‌రావు బదులివ్వడంతో జీవన్‌రెడ్డి ప్రసంగం కొనసాగించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తుపై తొలి సంతకం పెట్టిందని, విద్యుత్తు బకాయిలు రద్దు చేసి, కేసులన్నీ ఎత్తివేసిందని గుర్తు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. తన వంతు బాధ్యతగా రూ.1.50 లక్షల పరిహారం అందించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు కనీసం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులన్నింటికీ రూ.100 బోనస్ ప్రకటించాలని కోరారు. 352 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు.
 
 ఇదీ ఆత్మహత్యల లెక్క
 
 జీవన్‌రెడ్డి మాట్లాడిన అంశాలపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నట్లుగా విపక్షాలు చెబుతున్నాయన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఆత్మహత్యల వివరాలను వెల్లడించారు. 2004-05లో 816 మంది, 2005-06లో 452, 2006-07లో 360, 2007-08లో 270, 2008-09లో 250, 2009-10లో 196, 2010-11లో 132, 2011-12లో 151, 2012-13లో 116, 2013-14లో 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఐదు నెలల్లోనే బాధ్యతంతా తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, గతంలో చేసిన తప్పులు ఇందుకు కారణమేనన్నారు.
 
 వయసు మళ్లిన రైతులకు ప్రత్యేక పథకం: పి.వెంకటేశ్వర్లు
 
 వయసు మళ్లిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వమే ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ఆత్మహత్యలు జరిగేవి కావు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలి. పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలి. సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించాలి’’ అని సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన కరెంటులో వాటాను దక్కించుకోవడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలన్నారు.
 
 స్వతంత్ర కమిటీ ఏర్పాటుచేయాలి
 
 రైతుల ఆత్మహత్యలపై స్వతంత్ర నిజనిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ పేర్కొన్నారు. రైతుల రుణాలన్నీ ప్రభుత్వమే భరించాలని సీపీఎం నేత సున్న రాజయ్య డిమాండ్ చేశారు.
 
 ప్రభుత్వం పారిపోయింది
 
 ‘ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది. దూరదర్శన్‌లో గొర్రెల పెంపకం మాదిరిగా వ్యవసాయ శాఖ మంత్రి పాఠం చెప్పారు. హెడ్మాస్టార్ మాదిరి కేసీఆర్ చెప్పినట్లు మంత్రులకు పాఠం చెప్పారు. మేము వాకౌట్ చేస్తామని చెప్పినా స్పీకర్ మైక్ కట్ చేశారు. అయితే ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.     - టీడీపీ శాసనసభపక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు
 
 బుల్‌డోజ్ యత్నం సరికాదు...
 
 ‘అధికారపక్షం సభలో ప్రతిపక్షాన్ని బుల్‌డోజ్ చేయడాన్ని ఖండిస్తున్నాం. ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తామంటే ప్రభుత్వం నామోషీగా భావించింది. ప్రతిపక్ష సభ్యుడు తన ప్రసంగాన్నిపూర్తిచేయకుండానే నలుగురు మంత్రులు అంతరాయం కలిగించడం అసెంబ్లీ చరిత్రలోనే చూడలేదు.    - సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
 
 రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి
 
 ‘అమరవీరులకు ఇచ్చిన విధంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు  కూడా రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. పంట నష్టపోయిన ఎకరాకు 25 వేలు ఇవ్వాలి. రబీలో కరెంటు సరిగా సరఫరా చేసి పంటలు కాపాడాలి.     - బీజెఎల్పీ నేత లక్ష్మణ్
 
 సీఎం అనవసర జోక్యం
 
 సీఎం కేసీఆర్ పదేపదే కల్పించుని సభ్యులు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సభను వాయిదా వేసుకుని వెళ్లారు.    - సీపీఐ ఎమ్మెల్యే రవీందర్‌కుమార్
 
 రైతులను ఆదుకోవాలి
 
 వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇచ్చారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు వాటాలు రాబట్టుకునేందుకు అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి రాష్ట్రం హక్కుల సాధనకు పోరాడాలి. రైతులను ఆదుకోవాలి.        - వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
 
 లైన్ లాస్‌లు నివారించాలి
 
 ముఫ్పై ఏళ్ల కిందటి కండక్టర్లను మార్చి లైన్ లాస్‌లను నివారించాలి. టీడీపీ, బీజేపీలు కుట్ర చేసి భద్రాచలం నియోజకవర్గంలోని మండలాలను విడదీశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను పట్టించుకోవాలి. విద్యుత్తు సమస్యపై  శ్వేతపత్రం విడుదల చేయాలి.    - సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement