
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో షెడ్యూల్‌కంటే ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం విజయవంతమైనట్లే. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతం కావడం పార్టీ నాయకత్వానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు సభకు తరలిరావడంతో ముందస్తు ఎన్నికలకు చర్యలు వేగవంతం చేయాలన్న నిర్ణయానికి అధికార పార్టీ వచ్చింది. ప్రగతి నివేదన సభలో 49 నిమిషాలపాటు ప్రసంగించిన సీఎం కేసీఆర్ పరోక్షంగా ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు.
శాసనసభను రద్దు చేసి ముందుగా ఎన్నికలకు వెళ్లే విషయంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా మంత్రిమండలితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కమిటీలు తనకు అధికారమిచ్చాయని, ఈ మేరకు వచ్చే కొద్ది రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాలు ఉంటాయని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన మంత్రివర్గం మరోసారి సమావేశమై శాసనసభ రద్దుకు సిఫారసు చేస్తుందని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ‘ఎన్నికలకు వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. మీరే చూస్తారు... నాలుగైదు రోజుల్లో అనూహ్య మార్పులు ఉంటాయి’అని కేబినెట్ సమావేశానంతరం ఆ మంత్రి సాక్షి ప్రతినిధికి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కావడం వల్ల అదే రోజు శాసనసభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని టీఆర్‌ఎస్ వర్గాలు కూడా వెల్లడించాయి. ఆ వెంటనే మంత్రివర్గం గవర్నర్‌ను కలసి శాసనసభ రద్దు తీర్మానాన్ని అందిస్తుందని పేర్కొన్నాయి. శాసనసభను రద్దు చేసినా కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా కేసీఆర్ నాయకత్వంలోని మంత్రిమండలి ఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెబుతున్నాయి.
పథకాల వివరణకే ప్రాధాన్యత...
కొంగరకలాన్ సభలో ముఖ్యమంత్రి ప్రసంగమంతా నాలుగేళ్ల మూడు నెలల కాలంలో చేపట్టిన తన ప్రభుత్వ పథకాలను వివరించడానికే పరిమితమైంది. భారీ సంఖ్యలో జన సమీకరణ చేసినా ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై విరుచుకుపడలేదు. మామూలుగా ప్రత్యర్థి పార్టీలపై ఒంటికాలిమీద లేచే అలవాటు ఉన్న కేసీఆర్ ఈ సభలో మాత్రం ఆ ఊసే లేకుండా మాట్లాడారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, నేత కార్మికుల అవస్థలపై అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాసి తెలంగాణ కోసం నలుగురైదుగురితో కలసి ఉద్యమం మొదలుపెట్టి లక్ష్యాన్ని ఏ విధంగా సాధించిందీ మొదటి ఏడు నిమిషాలపాటు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఎన్నికలకు ముందే మంచినీరు ఇవ్వడంతోపాటు రైతుబంధు రెండో విడత ఆర్థిక సాయం నవంబర్‌లో ఇవ్వడానికి ఏర్పాటు చేశామని చెప్పడం ద్వారా డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చే వీలుందని పరోక్షంగా తేల్చిచెప్పారు.
నేడే నిర్ణయం తీసుకోవాలనుకున్నా...
శాసనసభను రద్దు చేస్తూ ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయంతీసుకోవాలని ముందుగానే భావించినా చివరి క్షణంలో దాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుని ప్రగతి నివేదన సభలో అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా 6వ తేదీకి దాన్ని వాయిదా వేశారని అత్యున్నత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందుకే కేబినెట్ సమావేశం కేవలం 15 నిమిషాలే జరిగిందని తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసిన విధానపరమైన నిర్ణయాలనే ఈ సమావేశంలో లాంఛనంగా ఆమోదించినట్లు ఆ తరువాత మంత్రులు ఈటల, హరీశ్, కడియం వెల్లడించిన విషయాల ద్వారా స్పష్టమైంది. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పవరణకు సంబంధించి మధ్యంతర భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు లాంటి ముఖ్యమైన నిర్ణయాలను కూడా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉండటం కూడా ఆదివారం నాటి సమావేశంలో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోకపోవడానికి కారణమని అంటున్నారు. ఈ రెండింటితోపాటు ముఖ్యమైన విధానపరమైన అంశాలను వచ్చే 2 లేదా మూడు రోజుల్లో ప్రకటించి 6న శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకుంటారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
రేపటిలోగా ప్రతిపాదనలు పంపండి
అన్ని శాఖలకు సీఎస్ సర్క్యులర్
మరోసారి కేబినెట్ భేటీ నేపథ్యంలోనే...
‘త్వరలోనే మంత్రివర్గ సమావేశం జరగనుంది. మీ శాఖల పరిధిలోని ప్రతిపాదనలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోగా పంపించాలి’అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారంలోపే మళ్లీ మంత్రివర్గ సమావేశం జరగనుండటం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment