
సాక్షి, హైదరాబాద్ : పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రూపొందించిన నూతన పురపాలక చట్టాల బిల్లును ఆమోదించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ భేటీ నిర్వహిస్తున్నారు. పురపాలనలో అవినీతి నిర్మూలన, నాణ్యమైన పౌర సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు కొత్తగా మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టం, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం, టౌన్‌ప్లానింగ్ చట్టాల ముసాయిదాను కేసీఆర్ తయారు చేయించారు. ఈ చట్టాలకు సంబంధించిన బిల్లును బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది. మరుసటి రోజు, అనగా ఈ నెల 18న రాష్ట్ర శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి 19న ఆమోదించనున్నారు. ఈ మేరకు ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త పురపాలక చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చే నెల తొలివారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
పీఆర్సీ కోసం ఉద్యోగుల నిరీక్షణ...
కొత్త పీఆర్సీ లేదా మధ్యంతర భృతి అమలు, పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు హామీల అమలు కోసం ఉద్యోగులు చాలా రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు. పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు తదితర అంశాలపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం సానుకూల ప్రకటన చేసే అవకాశముందని ఉద్యోగులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ అంశాలపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు నిర్వహించి తదుపరి మంత్రివర్గ భేటీలో ఓ నిర్ణయం తీసుకుంటామని గత నెల 18న జరిగిన మంత్రివర్గ భేటీ అనంతరం ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలా? లేదా ఆలోగా మధ్యంతర భృతి చెల్లించాలా? అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఈ రెండు విషయాలపై ముఖ్యమంత్రి సానుకూలతతో ఉన్నారని సంఘాల నాయకులు పేర్కొనడంతో ఉద్యోగవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
సచివాలయం తరలింపునకు పచ్చజెండా...
మంత్రివర్గ భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జరుగుతున్న సంప్రదింపుల్లో పురోగతిపై సైతం చర్చించనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్త సచివాలయం, శాసనసభ భవనాలు నిర్మిం చాలని గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, తాజా భేటీలో సచివాలయ కార్యాలయాల తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు సచివాలయ కార్యాలయాలను తరలించేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సైతం ఈ సమావేశంలో ఆమోదించనున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment