నేడు తెలంగాణ బంద్ | Telangana CM-designate kcr calls for shutdown Thursday | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణ బంద్

Published Thu, May 29 2014 1:18 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Telangana CM-designate kcr calls for shutdown Thursday

* పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు నిరసనగా టీఆర్‌ఎస్ పిలుపు
* ఆమోదించవద్దని రాష్ట్రపతికి కేసీఆర్ విజ్ఞప్తి
* ఆంధ్రా నేతల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందంటూ టీఆర్‌ఎస్ అధినేత ధ్వజం
* బిడ్డనూ చంపేందుకు మోడీ కుట్ర: ఈటెల
* ఇంచు భూమి కూడా వదులుకోబోమని ప్రకటన
* టీటీడీపీ నేతలకు చీమూనెత్తురుందా: హరీశ్
* బంద్‌కు పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు
* ఓయూలో నేటి పరీక్షలు వాయిదా
 
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం జారీ చేయ తలపెట్టిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఇందుకు నిరసనగా గురువారం తెలంగాణ బంద్‌కు పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి, బంద్ పిలుపునకు దారితీసిన తమ ఆందోళనను గురించి వివరించారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణలోని అన్నివర్గాలూ సహకరించాలని కోరారు.

ఆంధ్రా నాయకుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలపడానికి ఆర్డినెన్స్ పాస్ చేసిందంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక ఆర్డినెన్సును ఆమోదించొద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. టీఆర్‌ఎస్ బంద్ పిలుపు తెలిసిన వెంటనే సీపీఐ, న్యూ డెమొక్రసీ, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీలతో పాటు తెలంగాణ జేఏసీ, పలు ఉద్యోగ, విద్యార్థి, న్యాయవాద, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం జరగాల్సిన పలు కోర్సుల వార్షిక, సెమిస్టర్ పరీక్షలను బంద్ కారణంగా వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు.
 
బిడ్డను కూడా చంపే కుట్ర: ఈటెల
ఆర్డినెన్స్ వ్యవహారంపై టీఆర్‌ఎస్ నేతలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చినట్టుగా యూపీఏ ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ఇచ్చిందన్న ప్రధాని నరేంద్రమోడీ మాటలను పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. ఇప్పుడు బిడ్డను కూడా చంపడానికి మోడీ కుట్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సహచర ఎమ్మెల్యే ఎ.చందూలాల్, ఎమ్మెల్సీ కె.స్వామి గౌడ్, పొలిట్‌బ్యూరో సభ్యులు కె.రాజయ్య యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో కలసి ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు భయపడ్డట్టుగానే ఈ ప్రాంతంపై ఆంక్షలు పెట్టే, దోపిడీని కొనసాగించే కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారని విమర్శించారు.

‘‘ఖమ్మం జిల్లాలోని ఆ 7 మండలాలను తెలంగాణ నుంచి విడదీయొద్దని మోడీకి ఆయన ప్రమాణస్వీకారం సందర్భంగానే కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం దాన్ని పెడచెవిన పెట్టింది. ఆంధ్రా నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఆదరాబాదరాగా ఆర్డినెన్స్ తెస్తోంది. దానిపై మోడీ సంతకం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపినట్టుగా సమాచారముంది. దాన్ని ఆమోదించొద్దని రాష్ట్రపతిని మేం కోరుతున్నాం’’ అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించకుండా, అక్కడి ప్రజల అభిప్రాయాలను వినకుండా హడావుడిగా ఇలా ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలోని ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. దీనిపై న్యాయపోరాటం, ప్రజాపోరాటం చేస్తాం’’ అని హెచ్చరించారు. అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు తెలంగాణలోనే ఉంటూ గోతులు తీస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ‘‘ఇది అమానుషం, దారుణం. ఖమ్మంలోని 7 మండలాలను ఆంధ్రాలో కలపడానికి బాబు కుట్రలు చేస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలు చీమూనెత్తురు లేకుండా మౌనంగా పడి ఉంటున్నారేం? పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తెలంగాణ ప్రజల గొంతు కోస్తున్నా మాట్లాడటం లేదేం? తెలంగాణ బిడ్డలుగా వారికి చీమూ నెత్తురూ, పౌరుషం లేవా? దీనిపై మహానాడులో బాబును ఎందుకు ప్రశ్నించలేదు’’ అంటూ విమర్శించారు. స్వామి గౌడ్, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, జి.కమలాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజులతో కలసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలసి తెలంగాణకు ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. ‘‘గిరిజనులకు పోలవరం మరణశాసనం. దానికి నిరసనగానే వారు ఎన్నికలను కూడా బహిష్కరించారు’’ అన్నారు.

పోలవరం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే దాని డిజైన్ మార్చాలని కోరారు. ‘తెలంగాణ గడ్డపైనే ఉంటా, గిరిజనులకు మరణశాసనం రాస్తా’నంటే తెలంగాణ ప్రజలు బాబును ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు. దీనిపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. మరోవైపు, కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరుతూ టీడీపీ, బీజేపీ ప్రధాన కార్యాలయాలకు వెళ్లి ఆ పార్టీల నేతలను కోరతామని తెలంగాణ న్యాయవాదులు ప్రకటించారు.
 
సంఘాల మద్దతు
టీఆర్‌ఎస్ బంద్ పిలుపునకు పలు పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్డినెన్స్‌ను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. సీపీఐ (ఎంఎల్-న్యూడెమోక్రసీ) నేత న్యూ డెమొక్రసీ నేత కె.గోవర్ధన్, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం, కన్వీనర్ దేవీప్రసాద్, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కో కన్వీనర్లు శ్రీరంగారావు, గోవర్ధన్‌రెడ్డి, నాంపల్లి క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.కొండారెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శివశంకర్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ కార్యదర్శి బి.సురేందర్‌రెడ్డి, తెలంగాణ అధికారులు, ఉద్యోగ, కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి, తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవిలతో పాటు తెలంగాణ టీచర్స్ జేఏసీ, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, యూటీఎఫ్ (రంగారెడ్డి) కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి.
 
ఓయూ విద్యార్థుల మండిపాటు
పోలవరం ఆర్డినెన్స్‌పై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, విద్యార్థి నేతలు మండిపడ్డారు. బుధవారం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్ బంద్‌కు ఓయూలోని సుమారు 25 విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు.

ఓయూలోని మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, బీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వీరబాబు, తెలంగాణ తీన్‌మార్ అధ్యక్షుడు వరంగల్ రవి, అంసా అధ్యక్షుడు మాందాల భాస్కర్, ఓయూ పరిశోధన విద్యార్థి సంఘం అధ్యక్షుడు రవితేజ, పీడీఎస్‌యూ నాయకుడు కోట రాజేశ్, టీఆర్‌ఎస్వీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పెరిక శ్యామ్, ఏఐఎస్‌ఎఫ్ నేతలు శ్రీనివాస్, టీజీవీఎస్ అధ్యక్షుడు నె్రహూ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌నాయక్, పీడీఎస్‌యూ (విజృంభణ) నాయకులు దయాకర్, పాలడుగు శ్రీనివాస్, టీవీఎస్ నేత కోట శ్రీనివాస్‌గౌడ్, టీవీవీ నేతలు విజయ్, ఆజాద్ తదితరులు బంద్‌కు మద్దతు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement