రైళ్ల పునరుద్ధరణ వద్దు: కేసీఆర్‌ | Telangana CM KCR Urges PM Modi Not To Start Passenger Train Services | Sakshi
Sakshi News home page

రైళ్ల పునరుద్ధరణ వద్దు: కేసీఆర్‌

Published Tue, May 12 2020 1:58 AM | Last Updated on Tue, May 12 2020 5:39 AM

Telangana CM KCR Urges PM Modi Not To Start Passenger Train Services - Sakshi

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు. కనుక ఇప్పుడే ప్రయాణికుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరెటు పోతున్నారో తెలియదు. అలా వెళ్లే వారికి కరోనా ఉందో.. లేదో.. తెలుసుకోలేం. అందరికీ పరీక్షలు చేయడం సాధ్యంకాదు. రైళ్లలో వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్‌ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణికుల రైళ్లు నడపొద్దు.
(చదవండి: 
వైరస్పై యుద్ధం.. ఇలా చేద్దాం)

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్‌ చేయాలని, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సీఎం సూచించారు. జూలై–ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని, అది కూడా హైదరాబాద్‌ నుంచే వచ్చేలా ఉందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలసి పనిచేస్తున్నాయన్నారు. దేశంలో సరైన సమయంలో తగు నిర్ణయాలు తీసుకుంటూ ఆ మేరకు చర్యలు చేపడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌ మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి

  • కరోనా ఇప్పుడిప్పుడే మనల్ని వదిలిపోయేట్టు కనిపించడం లేదు. ఈ వైరస్‌తో కలసి బతకడం మనకు తప్పదు. ఆ విధంగా ప్రజల్ని నడిపించాలి. ముందుగా వారిలో భయాన్ని పోగొ ట్టాలి. కరోనాతో కలసి బతకడం నేర్చుకోవాలి. 
  • కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌ నుంచే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి కూడా వ్యాక్సిన్‌ వచ్చే చాన్స్‌ ఉంది. జూలై–ఆగస్టు నెలల్లో ఇది జరగొచ్చు. వ్యాక్సిన్‌ వస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. 
  • కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నాం. పరికరాలు, మందులు, మాస్కులు, పీపీఈ కిట్లు, బెడ్లు.. ఇలా కావాల్సినవన్నీ ఉన్నాయి. ఏ కొరతా లేదు. 
  • కరోనాతో ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడింది. ఆదాయాలు లేవు. అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదు. అన్ని రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్‌ చేయాలి. రైతుల రుణాలను ఎలాగైతే బ్యాంకులు రీ షెడ్యూల్‌ చేస్తాయో.. అలాగే రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్‌ చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలి.
  • ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచాలి. 
  • వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ట్రాలు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలి. మనది సెంటిమెంట్‌ ఉన్న దేశం. సొంత ఊళ్లలో పిల్లలను, తల్లిదండ్రులను వదిలి వచ్చారు. సొంతవాళ్లను చూసుకోవాలని వారికి ఉంటుంది. అందుకే సొంతూరు పోదామనుకుంటున్నారు. వారిని పోనివ్వకపోతే అనవసరంగా ఆందోళన తలెత్తుతుంది. ఒకసారి పోయి వస్తే, వారు స్థిమిత పడతారు. మళ్లీ పనిలోకి వస్తారు. శ్రామిక్‌ రైళ్లు వేయడం మంచి నిర్ణయం. తెలంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నాం. మళ్లీ ఆ కూలీలు వస్తున్నారు. తెలంగాణ రైసు మిల్లులలో పనిచేసే బిహార్‌ కార్మికులు ప్రత్యేక రైలు ద్వారా మళ్లీ తెలంగాణకు వచ్చారు. వారిని మేము సాదరంగా స్వాగతించాం. వస్తారు, పోతారు. రానివ్వాలి, పోనివ్వాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అలక్ష్యం వద్దు. 
  • పాజిటివ్‌/యాక్టివ్‌ కేసులు లేని జిల్లాలను ఆరెంజ్‌/గ్రీన్‌ జోన్లుగా మార్చమని కేంద్రాన్ని కోరుతున్నాం. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. పాజిటివ్‌ కేసులు లేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.. దీని కోసం రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరగాలి.
    (చదవండి: ప్రగతి భవన్కు రండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement