రాష్ట్ర శాసన సభ రద్దు జరిగిన నెల రోజుల తర్వాత ముందస్తు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే నెల 12న నోటిఫికేషన్ విడుదలతో మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. పోలింగ్ తేదీకి సుమారు రెండు నెలల గడువు ఉండడంతో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై రాజకీయ పక్షాలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ మినహా అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మహా కూటమి ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ఇంకా చర్చల దశలోనే ఉండగా, బీజేపీ ఇతర పక్షాలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది.
సాక్షి, మెదక్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలపై టెన్షన్ తొలగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 7వ తేదీన ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. షెడ్యూల్ విడుదలతో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థును ప్రకటించి, ప్రచారం ప్రారంభించిది. మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి.
ఎన్నికల షెడ్యూల్‌ను అనుసరించి నవంబర్ 12న నోటిఫికేసన్ విడుదల కానుంది. నవంబర్ 22వ తేదీ నామినేషన్ల సమర్పణకు తుది గడువు, నవంబర్ 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉండటంపై రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ రెండు నెలలు ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం నాయకుల్లో వ్యక్తం అవుతోంది.
జిల్లా యంత్రాంగా సిద్ధం
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో రాజకీయపార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ఇప్పటికే వరకే ప్రచారం ప్రారంభించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ౖ సెతం త్వరలో జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మహాకూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దసరా తర్వాతే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. బీజేపీ త్వరలో అభ్యర్థులను ప్రకటించనుంది. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు వీలుగా జిల్లాకు ఈవీఎంలు, వీవీపాట్‌లు సిద్ధంగా ఉంచారు. తుది ఓటరు జాబితాపై కసరత్తు జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలకు వచ్చిన వెంటనే ఓటరు తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాలో 538 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు 2,500 ఎన్నికల సిబ్బంది అవసరం కానున్నారు. ఎన్నికల్లో బందస్తు బస్తు ఏర్పాట్లపై పోలీసు శాఖ దృష్టి పెట్టింది. జిల్లాలోని పోలీసు సిబ్బందితోపాటు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను జిల్లాకు రప్పించేందుకు పోలీసుశాఖ సిద్ధం అవుతోంది.
షెడ్యూల్‌కు అనుగుణంగా..
ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌కు అనుగుణంగా మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఓటరు తుది జాబితాపై కసరత్తు సాగుతోంది. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే తుది ఓటరు జాబితాను ప్రకటిస్తాం. ఈవీఎం, వీవీపాట్‌ల వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నాం. –ధర్మారెడ్డి, కలెక్టర్
టీజేఎస్‌కు బ్రహ్మరథం..
మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఒకటి, రెండు రోజుల్లో మహాకూటమిలో భాగంగా సీట్ల పంపకం పూర్తి అవుతోంది. పల్లెల్లో టీజేఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, టీజేఎస్ వెంటే ఉన్నారు. మహాకూటమి సభ్యులను భారీ మెజార్టీలతో గెలిపించటం ఖాయం. –జనార్దన్‌రెడ్డి, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు
టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యం
మహాకూటమితో కలిసి తాము రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మంచి మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నాం. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కూటమి తరఫున అభ్యర్థులను బరిలో నిలుపుతాం. ఎవరు బరిలో ఉన్నా వారి విజయానికి కృషి చేస్తాం. టీఆర్‌ఎస్ పార్టీని ఓడించడమే మా లక్ష్యం. –గంగాధర్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
త్వరలోనే ప్రకటిస్తాం..
త్వరలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తాం. పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. టికెట్ కోసం నాయకులు చేసిన దరఖాస్తులను పరీశీలించి ఏఐసీసీకి పంపుతున్నాం. అధిష్టానం త్వరలోనే మొదటి విడత అభ్యర్థులను ప్రకటిస్తుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే మా ప్రచారాస్త్రాలు. ప్రచారంలో తమ పార్టీ నాయకులూ ముందంజలో ఉన్నారు. –సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు
ప్రచారంలో ముందంజ..
ఎన్నికలు ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంది. ఇది వరకే అభ్యర్థులను ప్రకటించాం. ప్రచారంలో మేమే ముందంజలో ఉన్నాం. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఓటు అడిగే హక్కు లేదు. రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం పథకాలు అమలు చేసిందన్నారు. –మురళీధర్‌యాదవ్, ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment