
సాక్షి, భూపాలపల్లి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాలతో పోలిస్తే భూపాలపల్లిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు ఉంటే ఇక్కడ మాత్రం ప్రధానంగా నలుగురు అభ్యర్థులు రంగంలో ఉండబోతున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు పార్వర్డ్‌బ్లాక్ పార్టీ నుంచి అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌లు దాఖలు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయా నాయకులకు ఇప్పటికే ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో కొత్త ఓటర్లు, తటస్థ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వారే గెలుపొందే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ నలుగురు కలిసినా ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. పోలింగ్ జరగక ముందే మెజారిటీపై అంచనాలు వేసుకుంటున్నారు.
టీఆర్‌ఎస్ నుంచి మధుసూదనాచారి, కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, ఏఐఎఫ్‌పీ నుంచి గండ్ర సత్యనారాయణరావు ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరెవరికి ఏ మండలంలో పట్టుంది.. అక్కడ ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. కొంతవారు ఎందరున్నారు.. తటస్థులు ఎవరు అని లెక్కలు కడుతున్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీదారుల సంఖ్య పెరిగింది. గత రెండు ఎన్నికల్లో ప్రధానంగా త్రిముఖ పోటీ ఉంది. ప్రస్తుతం నామినేషన్‌ల దాఖలుకు మరో రెండు రోజుల సమయం ఉంది. ఈ లోగా> అభ్యర్థుల సంఖ్య పెరిగినా నలుగురి మధ్యలోనే పోటీ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.
తటస్థులు, కొత్త ఓటర్లవైపు చూపు
ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన అభ్యర్థులకు పార్టీ తరపున, వ్యక్తిగతంగా కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. వీరి ఓట్లు తప్పకుం డా ఆయా పార్టీలకే పడతాయి. అయితే ప్రస్తుతం అందరి చూపు తటస్థంగా ఉంటే ఓటర్లు, కొత్త ఓటు హక్కు పొందినవారిపై పడింది. వారే గెలుపోటములను నిశ్చయించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10వేల మంది వరకు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు 12వేలు, 7వేల మెజారిటీ లభించింది. ఆయా ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రస్తుతం పోటీదారుల సంఖ్య పెరుగుతోం ది. నియోజకవర్గంలో కొత్తగా నమోదైన ఓట్లతో కలిపి 2 లక్షల 46 వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా మెజారిటీ మాత్రం గతంలో కంటే తక్కువగానే వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment