* పాత వాటి స్థానంలో కొత్త పథకాలకు రూపకల్పన
* గ్రాంట్‌ను 90 శాతం నుంచి 60 శాతానికి కుదింపు
* లక్ష్యాలను అధిగమిస్తే మరో 15 శాతం అదనంగా చెల్లింపు
* 15 శాతం కోతకు సిద్ధం.. 10 వేల కోట్ల మేర కత్తిరింపు
* డిస్కంలపై పెనుభారం, ప్రత్యేక రాష్ట్రాలకు మినహాయింపు
* రేపు ఢిల్లీలో రాష్ట్రాలతో భేటీకి అవకాశం
* కొత్త పథకాల విధివిధానాలపై చర్చించనున్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఇచ్చే నిధుల కత్తిరింపునకు రంగం సిద్ధమైంది. విద్యుత్ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాల స్థానంలో కొత్త వాటిని తీసుకొస్తూ గ్రాంట్ల భారాన్ని కేంద్రం తగ్గించుకుంటోంది. పర్యవసానంగా రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆర్థికంగా పెనుభారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కొత్త పథకాల విధివిధానాలపై మంగళవారం(23న) అన్ని రాష్ట్రాలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు రాష్ర్ట ఇంధన శాఖ వర్గాలకు సమాచారం కూడా అందింది. విద్యుత్ రంగంలో మార్పులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే గ్రాంట్ల విషయంపైనే ఇంధన శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గ్రామీణ, పట్టణ విద్యుదీకరణకు సంబంధించి ప్రస్తుతం రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన(ఆర్‌జీజీవీవై), రీ స్ట్రక్చర్డ్ యాక్సిలరేటడ్ పవర్ డెవలప్‌మెంట్ రిఫా ర్మ్స్ ప్రోగ్రాం(ఆర్‌ఏపీడీఆర్‌పీ) పేరిట దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర పథకాలు అమల్లో ఉన్నాయి. వీటి కింద గత యూపీఏ ప్రభుత్వం 90 శాతం నిధులను గ్రాంట్‌గా విడుదల చేసింది.
మిగతా పది శాతాన్ని రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్రాల డిస్కంలకు వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం వీటి స్థానంలో కొత్త పథకాలను రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన(డీడీయూజీజేవై), పట్టణ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత విద్యుత్ పంపిణీకి ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్(ఐపీడీఎస్)పేరిట కొత్త పథకాల అమలుకుకసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే నిధుల కూర్పును మార్చడం వల్ల ఈ పథకాలు రాష్ట్రాల పాలిట గుదిబండగా మారనున్నాయి.
ఇకపై భారీగా కత్తిరింపు
కొత్త పథకాల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు కేవలం 60 శాతం గ్రాంట్ రానుంది. మిగతా 40 శాతం నిధుల్లో పది శాతాన్ని డిస్కంలు సొంతంగా జమ చేసుకోవాలి. 30 శాతం నిధులను రుణంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పథకం అమలులో మైలురాళ్లను అధిగమిస్తే.. అదనంగా మరో 15 శాతం గ్రాంటు మంజూరవుతుందని కేంద్రం మెలిక పెట్టింది. దీంతో నిర్ణీత లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలకు సైతం మొత్తంగా 75 శాతం గ్రాంట్ మాత్రమే అందుతుంది. అప్పటికీ గతంతో పోల్చితే 15 శాతం నిధులను కేంద్రం కత్తిరించినట్లే అవుతుంది. అంతమేరకు డిస్కంలపై అదనపు భారం పడనుంది.
సొంతంగా పది శాతం నిధులు భరించటంతో పాటు... రుణం తీసుకునే నిధుల్లో పది శాతాన్ని డిస్కంలు తమ వంతు వాటాగా డిపాజిట్ రూపంలో ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సి వస్తుందని, ఇది పెను భారమేనని తెలంగాణ నార్తర్న్ డిస్కంకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా డిస్కంలపైనే ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్ రాయితీలతో ఆర్థికంగా కుదేలైన డిస్కంలు.. ఈ గ్రాంట్ల కుదింపుతో మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. కేవలం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం నుంచి 85 శాతం గ్రాంట్ లభించనుంది. సిక్కిం, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రత్యేక హోదాకు నోచుకోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ నిధుల కోత ఇబ్బందికరంగానే మారనుంది.
రాష్ట్రాలపై వేల కోట్ల భారం
ప్రస్తుతం అమల్లో ఉన్న 12వ పంచవర్ష ప్రణాళికతో పాటు.. 13వ పంచవర్ష ప్రణాళికలోనూ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పథకానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు కింద 2022 సంవత్సరం వరకు మొత్తం రూ. 43,033 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రస్తుతమున్న ఆర్‌జీజీవీవైని ఇందులోనే విలీనం చేసి.. మొత్తం రూ. 33,453 కోట్లను గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు మంజూరు చేయాల్సి ఉంటుందని కేంద్రం లెక్కగట్టింది. 90 శాతం గ్రాంటు కిందైతే రూ.38,729 కోట్లను చెల్లించాల్సి వచ్చేది. కానీ, కొత్త తిరకాసులతో అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలు ఏకంగా రూ. 5,276 కోట్ల భారాన్ని మోయాల్సి ఉంటుంది. దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, సోలార్ విద్యుత్, మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ పంపిణీ లక్ష్యంగా అమలయ్యే ఐపీడీఎస్ పథకానికి రూ.32,612 కోట్లు అవసరమని అంచనా.
ఇందులో రూ.25,354 కోట్లను గ్రాంట్లుగా ఇచ్చేందుకు ఆర్థిక ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుతమున్న ఆర్‌ఏపీడీఆర్‌పీ బదులు ఈ కొత్త పథకం అమలుకానుంది. అయితే గ్రాంట్లలో కోత విధించడంతో ఈ పథకం కింద కూడా రాష్ట్రాలపై రూ. 4 వేల కోట్లకుపైగా భారం పడనుంది. మొత్తంగా రెండు పథకాలు కలిపి రూ.10 వేల కోట్ల వరకు గ్రాంట్లకు కేంద్ర ప్రభుత్వం కత్తెర వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు డిస్కంలకు 2012లో కేంద్రం నుంచి దాదాపు రూ.2,000 కోట్లు మంజూరయ్యాయి. రుణ భారం తప్ప సొంత వాటాలు చెల్లించే అవసరం లేకపోవటంతో ఈ గ్రాంట్లతో డిస్కంలకు ఆర్థికంగా ఊరట లభించింది. కానీ, కొత్త నిబంధనలతో ఇరు రాష్ట్రాల్లోని డిస్కంలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ.800 కోట్ల భారం పడనుంది.
ఢిల్లీలో మంగళవారం రాష్ట్రాలతో భేటీ నిర్వహించేందుకు కేంద్ర ఇంధన శాఖ, కేంద్ర విద్యుత్ అథారిటీ సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్ ప్రభాకర్‌రావు, టీఎస్-ఎస్‌పీడీసీఎల్ చైర్మన్ సి.రఘుమారెడ్డి హాజరుకానున్నారు. అయితే సమావేశ తేదీ మారే అవకాశం ఉంది.
‘కోతల’ పథకాలు!
Published Mon, Dec 22 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement