పారిశ్రామికాభివృద్ధిలో మనమే నంబర్–1
► హైదరాబాద్‌లో శరవేగంగా ఏరోస్పేస్ రంగం అభివృద్ధి: కేటీఆర్
► ఇప్పటికే రెండు ప్లాంట్లు..త్వరలో మూడోది ఏర్పాటు చేస్తాం
► పరిశ్రమలకు నగరం కేంద్రంగా మారింది
► ఇప్పటిదాకా 2.30 లక్షల మందికి ఉపాధి కల్పించాం
► త్వరలో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడి
► ఆదిబట్లలో న్యూకాన్ యూనిట్ ప్రారంభం
ఇబ్రహీంపట్నం రూరల్: పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇప్పటికే శంషాబాద్, ఆదిబట్లలో రెండు ఏరోస్పేస్ ప్లాంట్లు ఉన్నాయని, మూడో ప్లాంట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల–నాదర్‌గుల్ పారిశ్రామిక వాడలో రక్షణ రంగ విడిభాగాల తయారీ కేంద్రం న్యూకాన్ ఏరోస్పేస్ యూనిట్‌ను హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుతో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అహ్వానం పలుకుతోందన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటును సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందశాతం అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. మధ్య, భారీ తరహా పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, టీఎస్‌ఐపాస్‌తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ పరిశ్రమల ఏర్పాటును సులభతరం చేసినట్టు వివరించారు. టీఎస్‌ఐపాస్ ప్రారంభించిన రెండేళ్లలోనే రాష్ట్రంలో 4,100 యూనిట్లు ఏర్పాటు చేసి 2.30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌లో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలను తయారుచేయడం కోసం నగరంలో వైమానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం లండన్‌కు చెందిన ట్రాన్స్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి
పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. సీఎం నిర్ణయాల వల్లే తెలంగాణకు అధిక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. పరిశ్రమలు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సతీశ్‌రెడ్డి, ఇస్రో డైరెక్టర్ ఎస్.సోమనాథ్, న్యూకాన్ చైర్మన్ హేమంత్ జలాన్, బీడీఎల్ సీఎండీ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయండి
కేంద్ర గనుల శాఖను కోరిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర గనుల శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్‌తో శనివారం సమావేశమయ్యారు. ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని, వెనుకబడ్డ ఖమ్మం ప్రాంతంలో యువతకు ఉద్యోగవకాశాలు కల్పించే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అత్యవసరమని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. కనీసం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చడంలో కేంద్రం సఫలం కాలేదన్నారు.
బీడీ కార్మికులకు అండగా ఉంటాం
బీడీ కార్మికులకు రాష్ట్రం అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. శనివారం బీడీ పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. బీడీ పరిశ్రమపై జీఎస్టీ పన్ను రేటు తగ్గించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే సీఎం లేఖ రాశారని, హైదరాబాద్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సీఎం ప్రస్తావిస్తారని చెప్పారు.