సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు కీలకమైన బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా లోకాయుక్త ఏర్పాటు, రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించేందుకు అవసరమైన బిల్లును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో తెలుగు అధికార భాషగా ఉండింది. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా అమలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబరులో పది జిల్లాలను 31 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరించాం.
ఉర్దూ మాట్లాడే వారి జనాభా 31 జిల్లాల్లోనూ ఉంది. రాష్ట్రం మొత్తం జనాభాలో ఉర్దూ మాట్లాడేవారి జనాభా 12.69 శాతం ఉంది. తెలంగాణ అధికార భాషల చట్టంను సవరించి రాష్ట్రం మొత్తానికి ఉర్దూను రెండో భాషగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటన జారీ చేసింది. అలాగే లోకాయుక్త సవరణ బిల్లు విషయంలోనూ మరో ప్రకటన జారీ చేసింది. ‘తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా లోక్‌పాల్, లోకాయుక్త చట్టం నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించాము. రాష్ట్రానికి విడిగా లోకాయుక్త, ఉప లోకాయుక్త సంస్థను స్థాపించేందుకు తెలంగాణ లోకాయుక్త చట్టంలో కొన్ని సవరణలు చేసేందుకు ఈ బిల్లు ఉద్దేశించినది’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment