
రుణ మాఫీపై ఆర్‌బీఐతో భేటీ నేడు
* ముంబైకి వెళ్తున్న ఆర్థిక సలహాదారు, సీఎస్ బృందం
* అన్ని అంశాలపై ఆర్‌బీఐ గవర్నర్‌తో చర్చ
* ప్రభుత్వ విధానాన్ని వెల్లడించనున్న అధికారులు
* ఎలాగైనా అనుమతి పొందేందుకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్న రుణ మాఫీ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం మరో అడుగేస్తోంది. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)తో చర్చించేందుకు ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ముంబై వెళుతోంది. అక్కడ ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో ఈ బృందం భేటీ కానుంది. రైతులకు లక్ష రూపాయల్లోపు రుణాల రద్దుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దాని అమలు విషయంలో అనుసరించే విధానంపై రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది.
దీని కోసమే ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కూడిన బృందం ఆర్‌బీఐ గవర్నర్‌తో చర్చలు జరపనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలు కోరడంతోపాటు, రుణ మాఫీ ద్వారా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేసేది కూడా రాజన్‌కు అధికారులు వివరించనున్నారు.
రుణ మాఫీపై సీమాంధ్ర ప్రతినిధులు ఇదివరకే రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌తో భేటీ అయిన సంగతి విదితమే. అయితే వారికి సానుకూల సంకేతాలేవీ రాలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కూడా తన వంతుగా ఆర్‌బీఐని మెప్పించే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. రుణ మాఫీతో రాష్ర్ట ప్రభుత్వంపై దాదాపు రూ. 17 వేల కోట్ల మేర భారం పడుతుందని ఇప్పటికే అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వల్ల 25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందే అవకాశముంది.
ఇదే విషయాన్ని అధికారులు.. ఆర్‌బీఐకి వివరించనున్నారు. పంటల దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో రైతులు కష్టాల్లో ఉన్నారని, వారికి రుణ మాఫీ చేస్తే తప్ప నష్టాల ఊబి నుంచి బయటపడలేని పరిస్థితి ఉందని వివరించనున్నారు. రుణ మొత్తాన్ని బ్యాంకులకు దశలవారీగా చెల్లిస్తామని చెప్పనున్నారు. రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉన్నందున చెల్లింపు పెద్ద కష్టం కాదని, నాలుగైదేళ్లలో వడ్డీతో సహా రుణ మాఫీ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్‌బీఐకి వివరించే అవకాశముంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు వెంటనే కొత్త రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని రాజన్‌ను కోరనున్నారు.
ఈ భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో గురువారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి సైతం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందున రుణ మాఫీకి ఆర్‌బీఐని మెప్పించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. బాండ్ల జారీ, భూముల తాకట్టు అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించనున్నట్లు అవి పేర్కొన్నాయి.