తెలంగాణలో ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే విద్యుత్ సమస్య తీవ్రమైందని.. దీనికి కేసీఆరే పూర్తిగా బాధ్యుడని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
గవర్నర్‌కు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల వినతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరెంట్ సంక్షోభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థతే కారణమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. విద్యుత్ ఇవ్వకుండా పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకు కూడా ముందుకు రావడం లేదని విమర్శించారు. శుక్రవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, సండ్ర వెంకటవీరయ్య, గాంధీ, కృష్ణారావు, నేతలు మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎం.ఎన్. శ్రీనివాస్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగం కరెంటు సమస్యతో సతమతమవుతున్నదని, పల్లెల్లో వ్యవసాయానికి మూడు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చే సినట్టు తెలిపారు.
విద్యుత్ ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, సర్కార్ తన చేతగాని తనాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టేసే ప్రయత్నం చేస్తూ దాడులకు దిగుతున్నదని వారు ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని వారు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తెస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మూడేళ్లయినా కరెంటు రాదని ఒప్పుకున్నారని విమర్శించారు. కరెంట్ కష్టాలకు కారణమైన కేసీఆర్ చంద్రబాబుపై ఆ నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి కరెంటు సమస్య పరిష్కరించాలని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని గవర్నర్‌ను కోరినట్టు వివరించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి రెచ్చగొట్టడం వల్లనే నల్లగొండలో టీడీపీ ఆఫీసుపై దాడిచేశారని, జగదీశ్వర్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దగ్గరుండి దాడులు చేయించిన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, టీడీపీ నేతలను హత్య చేయించేందుకు టీఆర్‌ఎస్ నేతలు వెనుకాడడం లేదని ఆరోపించారు.
కేసీఆర్ సర్కారును ఎండగట్టండి
టీ టీడీపీ నేతలతో బాబు
తెలంగాణలో ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే విద్యుత్ సమస్య తీవ్రమైందని.. దీనికి కేసీఆరే పూర్తిగా బాధ్యుడని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ ప్రభుత్వ పాలన సాగుతుందని, తెలంగాణకు అన్యాయం చేసే ఆలోచన తనకు లేదని పేర్కొన్నారు. టీడీపీ తెలంగాణ నేతలతో చంద్రబాబు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల గురించి ఈ సందర్భంగా నేతలతో చర్చించారు. వర్షాలు లేవని తెలిసి కూడా రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు చేయకపోవడం వల్లే తెలంగాణలో సంక్షో భం తీవ్రరూపం దాల్చిందని బాబు టీటీడీపీ నేతలకు చెప్పారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి పేరుతో రాజకీయం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం టీడీపీ నేతలపై ఉందని పేర్కొన్నారు.