
జన్నారం(ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీలు, లంబాడీ తెగల మధ్య ఘర్షణలు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో మంగళవారం మళ్లీ గొడవలు చెలరేగాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధి కొత్తపేట్ కొలాంగూడకు చెందిన ఆదివాసీ యువకుడిపై లంబాడీలు దాడి చేశారని తండాపై దాడికి పాల్పడ్డారు. ఇళ్లు, దుకాణాలపై దాడి చేసి చేతికందిన వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఎక్కడి వారిని అక్కడనే కట్టడి చేశారు. ఇరువర్గాలతో మాట్లాడి శాంతింపజేశారు.
కొత్తపేట్ కొలాంగూడ సమీపంలో చేపల పెంపకం చేపడుతున్న సిడాం భీంరావు సోమవారం రాత్రి చెరువు వద్ద కాపలాకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి అతడిపై దాడి చేశారు. భీంరావు తప్పించుకుని గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులకు సమాచారమివ్వగా.. వారు వెంటనే జన్నారం ఎస్‌ఐ రమేశ్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వచ్చి భీంరావును మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెల్లారేసరికి ఆదివాసీలకు తెలిసింది.
దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 300 మంది యువకులు, మహిళలు, నాయకులు మధ్యాహ్నం కొలాంగూడకు చేరుకున్నారు. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు తరలివచ్చా రు. ఇదే క్రమంలో మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు గౌస్‌బాబా, సీతారాములు, మంచిర్యాల, లక్సెట్టిపేట్, శ్రీరాంపూర్ సీఐలు, మంచిర్యాల, హాజీపూర్, దండేపల్లి, లక్సెట్టిపేట్, జన్నారం, కడెం ఎస్‌ఐలు తమ సిబ్బందితో కొలాంగూడకు చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్‌రావు, ఎస్‌బీ ఏసీపీ విజయసారథి వచ్చి ఆదివాసీ నాయకులతో చర్చించారు. సమస్య శాంతియుతంగా పరి ష్కరించుకుందామని, భీంరావుపై దాడిచేసిన వారిని పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు.
అక్కడి నుంచి వెళ్లి..
ఓ పక్క డీసీపీ వేణుగోపాల్‌రావు, ఏసీపీలు గౌస్‌బాబా.. సీతారాములు ఆదివాసీ నాయ కులతో మాట్లాడుతుండగా.. కొలాం గూడకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఆగ్రహంతో చేల నుంచి పరుగులు తీసి కొత్తపేట్‌లో లంబాడీలకు చెందిన ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. పలు ఇండ్ల కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. బయట ఉన్న వస్తువులను పగులకొట్టారు. రెండు కిరాణా దుకాణాలను ధ్వంసం చేశారు.
ఒక కారు అద్దాలు పగులకొట్టారు. రెండు ఇళ్లకు నిప్పంటించారు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పివేశారు. డీసీపీ, పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెళ్లి అందరినీ తిరిగి కొలాంగూడకు తీసుకువెళ్లారు. ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు, డివిజన్ అధ్యక్షుడు రాజుకుమార్, పవన్‌కుమార్ తదితరులకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.
నేడు జిల్లా బంద్‌కు పిలుపు
భీంరావుపై దాడికి నిరసనగా బుధవారం మంచిర్యాల జిల్లా బంద్‌కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఉన్న ఆదివాసీలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. దోషులను కనిపెట్టి కఠినంగా శిక్షించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు పవన్‌కుమార్, డివిజన్ నాయకుడు రాజుకుమార్ డిమాండ్ చేశారు.
సమీక్షించిన డీఐజీ, కలెక్టర్
కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్, మంచిర్యాల కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆర్‌వీ.కర్ణన్ కొలాంగూడలో పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల నేతలతో మాట్లాడారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండా లని పోలీసులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment