
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో సన్‌బర్న్ పార్టీ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో తొలిసారి జరుగుతున్న ఈ పార్టీకి యువత పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 17 ఏళ్ల లోపు బాలలను ఈ పార్టీకి అనుమతించకూడదని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసుల నిఘా నడుమ పార్టీ కొనసాగుతోంది. అయితే, సన్‌బర్న్ పార్టీ ప్రారంభమైన కాసేపటికే కలకలం రేగింది. ఓ యువకుడు ఆయుధంతో సన్‌బర్న్ పార్టీ వేదిక వద్ద దొరికిపోయాడు. ఓ వ్యక్తి తుపాకీతో పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రవేశద్వారం వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు అతని వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ తీసుకొని వచ్చిన ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.
‘సన్‌బర్న్’ వద్ద మైనర్లు..
సన్ బర్న్ ఈవెంట్ వద్ద మైనర్లకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. హైకోర్టు తీర్పు మేరకు మైనర్లను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో కొందరు మైనర్లు ఆందోళన చేపట్టారు. అనుమతి ఇవ్వనప్పుడు ఎందుకు ముందుగా టిక్కెట్లు విక్రయించారని అధికారులను నిలదీస్తున్నారు. వారికి వారి తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులను భారీగా మోహరించారు.
హైకోర్టు ఆదేశాలు..
సన్‌బర్న్ పార్టీకి హైకోర్టు మధ్యాహ్నం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సన్‌బర్న్ పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాలని ఎక్సైజ్ , లాండ్ ఆర్డర్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 30 లోగా వీడియో రికార్డులను సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ 30 కి వాయిదా వేసింది. నగరంలో శుక్రవారం నిర్వహించనున్న సన్ బర్న్ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువత డ్రగ్స్, మద్యానికి బానిసలవుతున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. మద్యం సరఫరా చేసే కార్యక్రమానికి మైనర్లను అనుమతించడం చట్ట విరుద్ధమన్నారు.
స్టేడియం వద్ద భారీగా బందోబస్తు
గచ్చిబౌలి స్టేడియం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సన్‌బర్న్ ఈవెంట్ షో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ షోను అడ్డుకుంటారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంత్ అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఈవెంట్ షోకు అనుమతినివ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. క్రీడల కోసం ఏర్పాటు చేసిన స్టేడియంను తాగి ఊగడానికి ఇస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment