
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) జి.రఘుమారెడ్డితో సహా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న మరో ఆరుగురు డైరెక్టర్ల పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) డైరెక్టర్(ఆపరేషన్స్) నర్సింగ్‌రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు జగత్‌రెడ్డి (ట్రాన్స్‌మిషన్), నర్సింగ్‌రావు (గ్రిడ్ ఆపరేషన్స్), జెన్‌కో డైరెక్టర్లు వెంకటరాజం (హైడల్ విభాగం), సచ్చిదానందం (థర్మల్ విభాగం)ల పదవీకాలం మరో ఏడాదికి పెరిగింది.
సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావుతో సమావేశమై డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు, నియామకాలపై చర్చించారు. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారికి ఏడాదిపాటు పొడిగింపు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా, రఘుమారెడ్డి పదవీకాలం 2016లో ముగియగా, అప్పుడు ఏడాదిపాటు పొడిగించారు. జెన్‌కో డైరెక్టర్లు వెంకట్రాజం, సచ్చిదానందంల పదవీకాలాన్ని వచ్చే ఏడాది నవంబర్ 30 గా నిర్ణయించారు. రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment