
చంద్రబాబు చూపిన ఆశతోనే..!
- ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో రేవంత్ బేరసారాలు
- టీటీడీపీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు హామీ
- ఆయన సూచన మేరకే ఎమ్మెల్యేలతో మంతనాలు
- ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న వ్యూహం? .. టీటీడీపీ నేతల్లో విస్తృత చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తానన్న పార్టీ అధినేత చంద్రబాబు హామీ మేరకే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్‌రెడ్డి బేరసారాలు జరిపారా..!? పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న ఉద్దేశంతోనే ఈ కొనుగోళ్లకు దిగారా..? ఈ ప్రశ్నలకు తెలంగాణ టీడీపీ వర్గాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి.
టీఆర్‌ఎస్, కాంగ్రె స్ పార్టీల్లో తనకు తెలిసిన ఎమ్మెల్యేలతో మా ట్లాడి టీడీపీ అభ్యర్థికి ఓటేసేలా రేవంత్ ప్రయత్నిస్తున్నారని, ఆయన సూచించిన అభ్యర్థికే టికెట్ ఇస్తానని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి మరోమారు అవకాశమివ్వాలన్న ఎర్రబెల్లి, ఎల్.రమణ తదితర సీనియర్ నేతల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. నర్సారెడ్డి ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయలేరని, ఆయనకు అవకాశమిచ్చి ఓటమిపాలు కావడం ఎందుకని బాబు ప్రశ్నించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల్లో అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతు తీసుకునే వ్యూ హంతో ముందుకు వెడుతున్నామని వివరించినట్లు తెలిసింది.
దీంతోపాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతలను ఎర్రబెల్లి, ఎల్.రమణ, సండ్ర వెంకటవీరయ్యలకు బాబు అప్పగించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఆర్థిక వనరులు సమకూరుస్తారని హామీ ఇచ్చారు. అయితే.. పార్టీ నుంచి సమాచారం బయటకు పొక్కకుండా తమకు బాధ్యతలు అప్పగించారే తప్ప ఆపరేషన్ సాగుతున్న తీరు తమకు ఏ దశలోనూ తెలియదని ఓ సీనియర్ నేత పేర్కొనడం గమనార్హం. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే తెలంగాణలో పార్టీని రేవంత్ ముందుండి నడిపిస్తారని చంద్రబాబు తన సన్నిహితులతో చెప్పినా టీటీడీపీ నేతలకు మాత్రం చెప్పకుండా రహస్యంగా ఉంచారు.
అసలేం జరిగింది..?
తెలంగాణ టీడీపీలో బహిరంగంగానే రెండు వర్గాలు పనిచేస్తున్నాయి. మండలి ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు సమయంలోనే వాటి మధ్య పెద్ద డ్రామా జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నర్సారెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఎర్రబెల్లి ప్రయత్నించారు. కానీ వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని రేవంత్ పట్టుబట్టారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగిన భేటీ సందర్భంగా ‘ఎన్నికల్లో నిలబడడానికి సరిపడా బలమే లేదు.. ఎలా గెలుస్తాం, గెలుపు కోసం ఎవరేం చేస్తారు?’ అన్న అంశంపై చర్చ జరిగింది.
ఈ సమయంలో తాను ఎలాగైనా రెండు ఓట్లను (ఇద్దరు ఎమ్మెల్యేలను) సంపాదిస్తానని రేవంత్ ధీమాగా చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా డబ్బుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అరికెలను రేసు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఖర్చు పెట్టడం తన వల్ల కాదని అరికెల వెనక్కి తగ్గడంతో ఎర్రబెల్లి కూడా చేతులు ఎత్తేశారని.. ఇది రేవంత్‌కు కలిసి వచ్చిందని అంటున్నారు.
ఎనిమిది మందికి గాలం..
ఎన్నికల్లో అవసరమైన ధనం సమకూర్చేందుకు బాబు అంగీకరించడంతో అభ్యర్థి ఎన్నికకు అవసరమైన రెండు ఓట్లకే పరిమితం కాకుండా.. ఏకంగా ఎనిమిది మందికి రేవంత్ గాలం వేశారు. వారిలో అత్యధికులు ఆమోదయోగ్యంగా ఉన్నారని బాబుకు సమాచారమిచ్చారు. ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులతో సొమ్ము సమకూర్చేలా మాట్లాడుకున్నారు. ఈ వ్యవహారంలో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు.. నామినేటెడ్ ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడారు.
చివరికి బండారం బయటపడింది. ఎంత ఖర్చయినా సరే సాధ్యమైనన్ని ఓట్లు సంపాదించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచన బాబుకు వచ్చిందని.. దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందని టీటీడీపీ నేతలు అంటున్నారు. అంతేకాదు బాగా పనిచేస్తున్నావంటూ రేవంత్‌ను చంద్రబాబు అభినందించారని చెబుతున్నారు. ఈ ఒక్క ఎమ్మెల్సీని గెలిపిస్తే తెలంగాణ టీడీపీలో తనకిక తిరుగుండదని సన్నిహితుల వద్ద గొప్పలు పోయిన రేవంత్ అత్యుత్సాహమే కొంప ముంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.