
పోలీసే కాదు... పోస్ట్ వచ్చినా హడలే!
* బెంబేలెత్తుతున్న ఏపీ సీఎం, ఆంతరంగికులు
* ‘ఓటుకు నోటు’ నోటీసులు వస్తాయని భయం
* పరిశీలించనిదే టపా తీసుకోవద్దని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ అవుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఆయన చుట్టూ ఉన్న వారికి కొత్త భయం పట్టుకుంది. తెలంగాణ ఏసీబీ, పోలీసులే కాదు చివరకు పోస్ట్ (తపాలా) పేరు చెప్పినా వారు ఉలిక్కిపడుతున్నారు. సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంతో పాటు ఆంతరంగికులకు పోస్టు ద్వారా వచ్చే లేఖలను కూడా క్షుణ్ణంగా పరిశీలించనిదే స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయా చోట్ల ఉండే ఉద్యోగులతో పాటు ఇన్‌వార్డ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
సీఎం నివాసం, కార్యాలయంతో పాటు ఇతర చోట్లకూ నిత్యం పదుల సంఖ్యలో వినతి పత్రాలు, ఫిర్యాదులు తదితరాలు పోస్టు ద్వారా వస్తుంటాయి. వీటిని అక్కడ ఉండే ఉద్యోగులు, ఇన్‌వార్డ్ సెక్షన్లవారు తీసుకుని ఎక్నాలెడ్జ్‌మెంట్స్‌పై స్టాంపులు వేస్తుంటారు. ఆ తరవాత కవర్లు తెరిచి ఆయా లేఖల్లో ఉన్న అంశాలను పరిశీలించే సంబంధిత విభాగాలకు, అవసరమైతే సీఎం ఇతర ప్రముఖుల దృష్టికి పంపిస్తుంటారు. ఇది నిత్యకృత్యంగా జరిగే పరిణామమే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు పోస్టు ద్వారానూ నోటీసులు పంపే అవకాశం లేకపోలేదని కొందరు చంద్రబాబుకు సూచించారు. ఈ నేపథ్యంలో పోస్ట్ పేరు చెప్తే చాలు అంతా ఉలిక్కిపడుతున్నారు.