- విద్యార్థుల ఫీజులతో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు
- రూ.436.49 కోట్లతో ఓయూ బడ్జెట్
- వేతనాల చెల్లింపులు, పెన్షన్లకే పెద్దపీట
- పీజీఆర్‌సీ, పరీక్షల విభాగానికి మళ్లీ మొండిచేయి
- హాస్టళ్లు, అనుబంధ కాలేజీలకు దక్కని వాటా
సాక్షి,సిటీబ్యూరో: అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిన్నివ్వదు.. అన్నట్లుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలకమండలి పరిస్థితి. ఉన్న వనరులను పెంచుకోలేక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను తెచ్చుకోలేక చివరకు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బును ఉద్యోగుల జీతాలు, వారి పెన్షన్లకు మళ్లించింది.
పరీక్షల విభాగం, ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్యా కేంద్రానికి చెందిన ఆర్థిక వనరులను వేతనాలు,పెన్షన్ల చెల్లింపు ఖాతాలోకి మళ్లించడమే కాకుండా, తాజా బడ్జెట్‌లో కూడా ఆ విభాగాలకు మొండిచేయి చూపిం చింది. ఉపకులపతి (వీసీ) ప్రొ.సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం వర్సిటీ పరిపాలనా భవనంలో బడ్జెట్ సమావేశం జరిగింది. పాలకమండలి సభ్యుడు ప్రొ.మల్లారెడ్డి ఈవిద్యా (2014-15) సంవత్సరానికి రూ.11.97 కోట్ల లోటుతో రూ.436.49 కోట్లతో ప్రవేశపెట్టిన వార్షికబడ్జెట్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమో దించారు. గత (2013-14) వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.51 కోట్లు అదనం.
ఇదిలా వుంటే ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోకుండా, ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బును వేతనాలు, పెన్షన్ల చెల్లింపుకు మళ్లించడం అన్యాయమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ఆదాయంలో కనీసం 10శాతం నిధులను కూడా ఆవిభాగాల అభివృద్ధికి కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ గ్రాంటు రూ.170.14 కోట్లే
బ్లాక్‌గ్రాంట్ రూపంలో ప్రభుత్వం రూ.170.14 కోట్లు కేటాయించింది. మిగిలిన మొత్తాన్ని పరీక్షల విభాగం, దూరవిద్యా కేంద్రం,యూజీసీ, నాన్‌యూజీసీ స్కీమ్‌ల కింద సమకూర్చుకోనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులతో పాటు సెల్ప్‌ఫైనాన్స్ కోర్సులు, దూరవిద్యాకోర్సు ఫీజులు ఆయా విభాగాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఈ నిధులను వేతనాలు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపులకు మళ్లిం చారు.
గతంతో పోలిస్తే ప్రభుత్వ బడ్జెట్‌లో వర్సిటీకి కొంత ప్రాధాన్యమిచ్చినప్పటికీ... కేటాయించిన నిధులు వేతనాలకు కూడా సరిపోవడంలేదు. అనివార్యంగానే ఆయా విభాగాల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధులు వేతనాలకు మళ్లించాల్సి వస్తోందని అధికారులు చెప్పారు.