
కాళేశ్వరం కాల్వల్లో మార్పులు
ఇప్పటికే రీ డిజైన్‌లో భాగంగా రిజర్వాయర్ల సామర్థ్యాలను పెంచగా, తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–13, ప్యాకేజీ–19లో చేసిన పలుమార్పులను ఆమోదిస్తూ గురువారం నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
♦ ప్యాకేజీ 13, ప్యాకేజీ–19 డిశ్చార్జి సామర్ధ్యంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే రీ డిజైన్‌లో భాగంగా రిజర్వాయర్ల సామర్థ్యాలను పెంచగా, తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–13, ప్యాకేజీ–19లో చేసిన పలుమార్పులను ఆమోదిస్తూ గురువారం నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ప్యాకేజీ–13ను మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తిప్పారం రిజర్వాయర్‌కు నీటి కాల్వల సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసి 53వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు.
తాజా మార్పులతో మల్లన్నసాగర్ నుంచి కూడెళ్లి వాగు పరిధిలోని ప్యాకేజీ–14, ప్యాకేజీ–15లకు గ్రావిటీ కాల్వల సామర్థ్యాన్ని 9వేల క్యూసెక్కులకు పెంచారు. దీనికి సమాంతరంగా 6,100 క్యూసెక్కుల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నుంచి ప్యాకేజీ–17కి నీటిని తరలించేలా ప్రణాళిక వేశారు. ఈ మొత్తం వ్యవస్థ ద్వారా 40వేల ఎకరాలకు నీరందించే అవకాశాలున్నాయి. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలపడంతో పాత వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి కొత్త ప్రణాళికకు ఓకే చేశారు.
ఈ కాల్వల వ్యవస్థ నిర్మాణానికి రూ.597.70 కోట్లకు ఆమోదం తెలిపారు. వీటికి కొత్తగా టెండర్లు పిలవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ప్యాకేజీ–19లో పాత డిజైన్‌మేరకు కాల్వల వ్యవస్థను 2,974 క్యూసెక్కులతో ప్రతిపాదించి, మొహన్నదా బాద్‌నుంచి చేర్చాల మధ్యలో 70 నుంచి 96వ కిలోమీటర్ వరకు నీటిని సరఫరా చేసి 25వేల ఎకరాలకు నీటిని అందించాలని నిర్ణయించారు. తాజాగా ఆ డిజైన్‌లో మార్పులు చేసి కాల్వల సరఫరా సామర్థ్యాన్ని 2,758 క్యూసెక్కులకు తగ్గించారు. అయితే ఆయకట్టును మాత్రం మరో 53వేల ఎకరాలకు పెంచి మొత్తంగా 78వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. దీనికి మొత్తంగా రూ.766 కోట్లు అవుతాయని అంచనా వేశారు.