- ఆరుగురి సభ్యుల్లో రిటైర్డ్ ఐఏఎస్ పాపారావుకు అవకాశం
- అస్సాం హోం సెక్రటరీగా విధులు.. ఐక్యరాజ్యసమితిలోనూ బాధ్యతలు
- ఇన్‌టాక్ లైఫ్ మెంబర్‌గా కొనసాగుతున్న విశ్రాంత అధికారి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి ఆరుగురు విశ్రాంత ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సలహా సంఘం సభ్యుల్లో బీవీ.పాపారావుకు అవకాశం దక్కింది. పాపారావు వరంగల్ జిల్లా వాసి. ఆయన స్వగ్రామం నెల్లికుదురు మండలం మునిగలవీడు. 1970 దశకంలో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో పాపారావు డిగ్రీ చదివారు.
అనంతరం 1982 బ్యాచ్ అస్సాం కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం హోం సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున పని చేశారు. పాపారావుకు మంచి పరిపాలనాదక్షుడిగా పేరుంది. ఉద్యోగ కాలం పూర్తి కాకుండానే ముందస్తు ఉద్యోగ విరమణ చేసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వారసత్వ సంపద పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా పాలకుర్తి మండలం బమ్మెరలో పొతన వంశీకులకు సంబంధించి సుమారు నాలుగు ఎకరాల భూమిని కొని అభివృద్ధి చేస్తున్నారు.
ఇన్‌టాక్ లైఫ్ మెంబర్‌గా కూడా పాపారావు ఉన్నారు. కాకతీయ ఉత్సవాల సమయంలో ప్రతే ్యకంగా కాఫీటేబుల్ బుక్ రూపొందించారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువులపై ‘ఇరిగేషన్ ఆఫ్ కాకతీయ’ పేరుతో సమగ్ర సమాచారం సేకరించి అందుబాటులో ఉంచారు. 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు జయూపసేనాని రచించిన నిత్యరత్నావళి గ్రంధాన్ని ఆంగ్లంలో అనువాదం చేసి ప్రపంచవ్యాప్తంగా కాకతీయ కీరిన్తి ఇనుమడింపజేసేందుకు కృషిచేశారు.
ఇన్‌టాక్ కన్వీనర్‌గా పనిచేస్తున్న నిట్ పూర్వ ఆచార్యులు పాండురంగారావు ఈ మేరకు స్పందిస్తూ... ‘మేము ఇన్‌టాక్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా కలిసి పనిచేస్తున్నాం. పాపారావు ప్రభుత్వ సలహా సంఘంలో సభ్యుడిగా నియమితులు కావడం సంతోషదాయకం. పాపారావు మార్గనిర్ధేశకంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది.’ అని ఆకాంక్షించారు.