మహబూబాబాద్, కాంగ్రెస్ పార్టీ దోపిడీకి మారు పేరుగా మారిందని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు *లక్షల కోట్లు దండుకున్నారు.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతోపాటు మానుకోట ఎమ్మెల్యే కవిత అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి చెప్పారు.
స్థానిక ఘణపురపు అంజయ్య గార్డెన్‌లో మంగళవారం జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రజాప్రతినిధులు సమస్యలను అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందు మాజీ మంత్రి రెడ్యానాయక్, ఎమ్మెల్యే కవిత కేసీఆర్‌తో మంతనాలు జరిపారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను పార్టీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పడం వల్లె వారు చేరలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో పాల్గొనకుండా తెలంగాణ మేమే తెచ్చామని ప్రచారం చేసుకోవడం సిగ్గుగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులను చూస్తుంటే ‘ఏ దొడ్డిలో కట్టినా పర్వాలేదు.. మనదొడ్డిలో ఈనితే చాలు’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణవాదుల ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని చెప్పారు.
కేసీఆర్ పోరాటం.. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బలమైన రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్ ఉండాలని అన్నారు. కేసీఆర్ చేతిలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలలో టీఆర్‌ఎస్ ఒంటిరిగానే బరిలో నిలుస్తుందని, ఎన్నికల్లో తాను స్వయంగా ప్రచారం చేస్తానని చెప్పారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తేజావత్ రాంచంద్రు నాయక్, నాయకులు జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, సంగులాల్, నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.