కోటలో వేటగాడు!
► డబ్బున్నోళ్ల ఆట.. రిసార్ట్ ముసుగులో వేట..
► సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అడవుల్లో వన్యప్రాణుల వేట
♦ రిసార్ట్ పేరుతో విచ్చలవిడి వ్యవహారం
♦ అడవి జంతువులను వధించి వాటి మాంసంతో విందులు
♦ ధనవంతులు, బడా వ్యాపారులు, వారి పిల్లల ఆటవిక క్రీడ
♦ అడవిని ఆనుకుని రిసార్ట్.. సాయంత్రమైతే చొరబాటు
♦ ‘షికారు’ పేరిట ఈవెంట్‌గా వేట
♦ దుప్పులు, కొండ గొర్రెలు, నెమళ్లు మాయం
♦ విషయం తెలిసీ పట్టించుకోని అటవీ శాఖ అధికారులు
♦ మామూళ్ల మత్తులో పోలీసు అధికారులు
అదో అటవీ ప్రాంతం.. దుప్పులు, కొండ గొర్రెలు, నెమళ్లు వంటి ఎన్నో వన్యప్రాణులకు నిలయం.. అలాంటి అడవిలోకి ఓ రిసార్ట్ చొరబడింది.. గండికోటలా అన్ని విలాసాలతో ధనవంతులు, బడా వ్యాపారులు, వారి పిల్లల ఆటవిక క్రీడలకు నిలయంగా మారింది. డబ్బులు కడితే చాలు అక్రమంగా అడవిలోకి ప్రవేశించి.. ఇష్టమొచ్చినట్లుగా వన్యప్రాణులను వేటాడవచ్చు! వాటి మాంసంతో విందులూ ఆరగించవచ్చు.. సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అటవీ ప్రాంతంలో రిసార్ట్ ముసుగులో జరుగుతున్న వ్యవహారమిది. విషయం తెలిసినా పోలీసులు, అటవీ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోకపోవడంతో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం..
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అటవీ ప్రాంతంలో ఆధునిక హంగులతో ఓ రిసార్ట్ కట్టారు. దాదాపు 170 ఎకరాల విస్తీర్ణంలో అడవికి ఆనుకుని ఏర్పాటు చేశారు. అడవిలో కలసిపోయి ఉండటంతో నెమళ్ల గుంపులు, వన్యప్రాణులూ ఇందులోకి వస్తుంటాయి. ఈ రిసార్ట్‌లో రాచరిక కాలం నాటి తరహాలో ఆకర్షించే భవనాలు, పట్టుపాన్పులు, పంచభక్ష్య పరమాన్నాలు, చెలికత్తెలు, సేవకులు.. ఇలా అన్నీ సిద్ధం.
కాస్త ఖర్చుపెడితే రోజంతా రాజుల్లా గడపొచ్చు. మరి రాజు అన్నాక వేట కూడా ఉంటుంది కదా!.. అందుకే అన్నట్లుగా పేజ్‌త్రీ పర్యాటకులను ఆకర్షించడం కోసం వేటను ‘షికారు’ పేరిట ఒక ఈవెంట్‌గా పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రిసార్టుకు వచ్చేవారు దానికి ఆనుకుని ఉన్న అడవిలోకి వెళ్లి జంతువులను వేటాడుతున్నారని.. అలా వేటాడి తెచ్చిన వాటిని వండి వడ్డిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల పిల్లలను ఆకర్షించడం కోసం ఈ వేటకు బాటలు వేసినట్టు తెలుస్తోంది. స్థానిక రైతులు ఈ వేట వివరాలను ‘సాక్షి’ప్రతినిధికి వెల్లడించారు.
సాయంత్రం ఆరు నుంచి మొదలు
సాధారణంగా అడవి జంతువులు సాయంత్రం వేళలో వాటి ఆవాసాల నుంచి బయటికి వచ్చి సంచరిస్తుంటాయి. దీంతో రిసార్ట్ యాజమాన్యం షికారు పేరుతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేట నిర్వహిస్తోంది. వేట కోసం ప్రత్యేకంగా కుక్కలను పెంచుతున్నారు. రిసార్టు సిబ్బంది, పర్యాటకులు ఆ వేట కుక్కలను పట్టుకుని అడవిలోకి వెళతారు. అక్కడక్కడా ఎంచుకున్న చోట్ల ఇనుప కంచెల బోనులు ఏర్పాటు చేస్తారు. తర్వాత కాస్త ముందుకు వెళ్లి వన్యప్రాణులను కర్రలతో వెంటాడి ఆ బోనుల వైపు వచ్చేలా తరుముతారు. బోనుల్లో చిక్కుకున్న వన్యప్రాణులను రిసార్టుకు పట్టుకువచ్చి వధిస్తున్నారు. వాటి మాంసంతో వంటకాలు తయారుచేసుకుని తింటున్నారు. ఇక అడవిలోంచి రిసార్టులోకి వస్తున్న నెమళ్ల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే.
కొండ గొర్రెలు, దుప్పులను వేటాడి..
కొంత కాలంగా గుట్టుగా సాగుతున్న వన్యప్రాణుల వేట వ్యవహారం ఇటీవలే బయటకు పొక్కింది. మే నెల మూడో వారంలో రిసార్టు సిబ్బంది, పర్యాటకులు కలసి మూడు కొండ గొర్రెలు, ఒకదుప్పిని వేటాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాటిలో దుప్పిని, ఒక కొండ గొర్రెను అదే రోజున వధించి.. వాటి మాంసంతో విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మిగతా రెండు కొండ గొర్రెలను రిసార్టు ఇనుప కంచెలో ఉంచగా.. కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారని తెలిసింది.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. ఆ రోజున సిబ్బందితో కలసి రిసార్టుకు వెళ్లారని, కానీ కేసు నమోదు చేయకుండానే వెనుదిరిగారని సమాచారం. అప్పటిదాకా ఇలాంటి రిసార్టు ఒకటి ఉందనే విషయం స్థానికంగా కూడా పెద్దగా తెలియకపోవడం గమనార్హం. అయితే ఆలస్యంగా సమాచారం అందుకున్న సిద్దిపేట ఫారెస్టు రేంజర్ శ్యాంసుందర్‌రావు తన సిబ్బందితో కలసి ఆ రిసార్టుపై దాడి చేశారు. రెండు కొండ గొర్రెలను స్వాధీనం చేసుకుని, రిసార్టు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
కేసులు పెట్టి వదిలేశారు
అటవీ అధికారులు రిసార్టుపై దాడి చేసిన వెంటనే రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి కేసులు పెట్టకుండా నిందితులను వదిలేయాలంటూ వారు అధికారులపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. దానికి తలొగ్గిన అధికారులు సాధారణ సెక్షన్ల కింద కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు. దర్యాప్తును గాలికొదిలేశారు. స్వాధీనం చేసుకున్న కొండ గొర్రెలను నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తికి చూపించి.. నర్సాపూర్ అడవుల్లోనే వదిలేశారు.
ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మళ్లీ రిసార్టు ముసుగులో వేట కొనసాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు రిసార్టు కేసు వివరాల కోసం ‘సాక్షి’ప్రతినిధి సిద్దిపేట డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, రేంజర్ శ్యాంసుందర్‌రావులకు విజ్ఞప్తి చేసినా, వారం రోజుల పాటు తిరిగినా.. వారు వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే రిసార్టులో కొండ గొర్రెలను బంధించిన మాట నిజమేనని, వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామని శ్యాంసుందర్‌రావు చెప్పారు.