
మిషన్ కాకతీయ వెబ్‌సైట్ ఆవిష్కరణ
చెరువుల పునరుద్ధరణ పనుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచేలా చిన్న నీటిపారుదల శాఖ ‘మిషన్ కాకతీయ’ వెబ్‌సైట్‌ను ఆరంభించింది.
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణ పనుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచేలా చిన్న నీటిపారుదల శాఖ ‘మిషన్ కాకతీయ’ వెబ్‌సైట్‌ను ఆరంభించింది. గురువారం ఈ వెబ్‌సైట్‌ను ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జలసౌధలో ఆవిష్కరించారు. పారదర్శకత కోసం ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశ విదేశాల్లోని తెలంగాణ ప్రజలు చెరువుల సమాచారాన్ని తెలుసుకోవచ్చని, విరాళాలను కూడా ఆన్‌లైన్‌లో స్వీకరించేలా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దామని చెప్పారు.
చెరువును దత్తత తీసుకోవాలనుకున్న వారు వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. బిల్లుల చెల్లింపులను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.2,552 కోట్లతో 8,116 చెరువులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని, అందులో 6,223 చెరువుల పనులు మొదలయ్యాయని వివరించారు. వచ్చే ఏడాది పనులు ఆలస్యం కాకుండా డిసెంబర్ వరకే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి నుంచే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.