- మే నెలాఖరులోగా చెరువుల మరమ్మతు పనులు పూర్తిచేయాలి
- అధికారులతో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
- ఉప ఇంజినీర్ల పనితీరుపై అసంతృప్తి
- వెంటనే తాఖీదులివ్వాలని కలెక్టర్‌కు ఆదేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో తలపెట్టిన మిషన్ కాకతీయ మొదటివిడత పనులన్నీ వచ్చేనెలాఖరులోగా పూర్తిచేయాలని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి నీటిపారుదల ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మిషన్ కాకతీయ పురోగతిపై కలెక్టర్ రఘునందన్‌రావుతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మిషన్ కింద ఇప్పటివరకు ప్రభుత్వం 554 చెరువుల అభివృద్ధికి రూ.158 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇందులో 362 చెరువుల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, 155 చెరువుల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. వెంటనే అన్ని చెరువుల పనులు మొదలుపెట్టి నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలన్నారు. కొందరు ఉప ఇంజినీర్ల పనితీరు సంతృప్తికరంగా లేదని, అందువల్లే మిషన్ పనుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని సహించేది లేదన్నారు. అలాంటివారికి వెంటనే తాఖీదులివ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశం, ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.
‘మిషన్’లో వేగం పెంచండి
Published Wed, Apr 29 2015 1:05 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement