
ఇంకు పడుద్ది!
పక్కాగా సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఎత్తుగడ
డూప్లికేషన్‌కు కళ్లెం వేసేందుకు ఆలోచన
పలుచోట్ల నమోదుకాకుండా వేళ్లకు సిరా
తహసీల్దార్లకు ఎస్‌ఎంఎస్ సందేశాలు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సమగ్ర కుటుం బ సర్వే’ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఒకే వ్యక్తి పలు కుటుంబాల్లో నమోదుకాకుండా నియంత్రించడానికి వేలుపై సిరా గుర్తు పెట్టాలని నిర్ణయించింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు మాత్రమే చూపుడు వేలుపై సిరా చుక్క పెడతారు. తాజాగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇంటింటి సర్వేలో అవకతవకలు జరగకుండా అరికట్టవచ్చని భావిస్తోంది. జిల్లావ్యాప్తంగా 8 లక్షల కుటుంబాలుండగా, వీటిలో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డవారే. 19వ తేదీ ఒకేరోజు జరిగే సర్వేలో వీరిలో చాలామంది అటు ఇటు పేర్లను నమోదు చేసుకునే అవకాశముందని సందేహించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డూప్లికేషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు సమాచారం సేకరించిన పౌరుల వేళ్లకు ఇంకు గుర్తును నమోదు చేయాలని తాజాగా నిర్ణయించింది.
ఈ మేరకు శుక్రవారం సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్) ద్వారా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టరేట్ నుంచి తక్షణమే సిరా సీసాలను తీసుకెళ్లాలని సూచించింది. కాగా ఈ సర్వేను మరుసటి రోజుకు కూడా పొడిగించే అవకాశం లేకపోలేదని తాజా సంకేతాలను బట్టి తెలుస్తోంది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లిన వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం.