
మళ్లీ పంపండి
బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలు రద్దు
15లోగా కొత్త ప్రతిపాదనలు పంపాలి
కొత్తగా పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో బీఆర్‌జీఎఫ్ ప్రతిపాదనలు వెనక్కి పంపాం. ఈ నెల 15వ తేదీలోగా మండల పరిషత్ నుంచి తీర్మానాలు జెడ్పీకి పంపాలని అధికారులను ఆదేశించాం. 25వ తేదీలోగా జెడ్పీ పాలకవర్గం ఆమోదంతో మొత్తం ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తాం.
- దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ
గ్రామాల్లో పనుల గుర్తింపు ప్రతిపాదనల్లో తమకూ అవకాశం ఇవ్వాలని ఎంపీపీలు, జెడ్పీటీసీలు అధికారులను కోరారు. దీనికి జెడ్పీచైర్మన్ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో నిన్నామొన్నటి దాకా రూపొందించిన ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. 2014-15 ఆర్థిక సంవతర్సానికి గాను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం (బీఆర్‌జీఎఫ్) కింద కేంద్రం జిల్లాకు 33.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధుల కేటాయింపులో తమదైన ముద్ర వేసేందుకు ఎంపీపీలు, జెడ్పీటీసీలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
నల్లగొండ: గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూపొందించిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్‌జీఎఫ్) ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. నిన్నామొన్నటి వరకు మండల, జిల్లా పరిషత్‌లో పాలకవర్గాలు లేవన్న కారణంతో బీఆర్‌జీఎఫ్ ప్రణాళికను మండలాధికారులు సిద్ధం చేసి జిల్లా పరిషత్‌కు పంపారు. దాదాపు అన్ని మండలాల్లో పనుల గుర్తింపు పూర్తయ్యాయి. తీర్మానాలు కూడా సిద్ధం చేశారు.
గ్రామ, మండల స్థాయిలో తీర్మానాలు పూర్తి చేసి 25 మండలాలకు సంబంధించిన ప్రణాళికలు కూడా జిల్లా పరిషత్‌కు చేరాయి. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నెల 5 తేదీన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు కొలువుదీరడంతో పనులు గుర్తింపులో తమకూ అవకాశం ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. దీనికి జెడ్పీ చైర్మన్ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో ఇప్పటివరకు చేపట్టిన కసరత్తు అంతా కూడా మళ్లీ మొదటికొచ్చింది. గత ప్రతిపాదనలు రద్దు చేసి కొత్తవి తయారు చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
2014-15 ఆర్థిక సంవతర్సానికి గాను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్‌జీఎఫ్) కింద కేంద్రం జిల్లాకు రూ.33.80 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను గ్రామాల్లో పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఖర్చు చేస్తారు. అయితే పనుల ప్రతిపాదనలు పంపాలని రెండు నెలల క్రితమే జెడ్పీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు పంపాలని సూచించింది.
ఈ ఆదేశాలను జెడ్పీ అధికారులు మండల, మున్సిపల్ అధికారులకు పంపారు. అయితే అధికారుల వివిధ కారణాల దృష్ట్యా ప్రతిపాదనలు పంపడంలో తీవ్ర జాప్యం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా అన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 25 మండలాల నుంచి మాత్రమే వచ్చాయి. ఈలోగా జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో మిగతా మండలాల నుంచి ప్రతిపాదనలు రాకుండా అధికారులు ఆపేశారు.
కలిసొచ్చిన అదృష్టం..
బీఆర్‌జీఎఫ్ నిధుల్లో గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30శాతం, జెడ్పీటీసీ సభ్యులకు 20శాతం నిధులు కేటాయిస్తారు. దీంతో తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు ఈ నిధుల కేటాయింపుపై తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. కొలువుదీరిన వెంటనే బీఆర్‌జీఎఫ్ రూపంలో కలిసొచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. దీనికి జెడ్పీ చైర్మన్ కూడా అంగీకారం తెలపడంతో జెడ్పీ అధికారులు ఇప్పటివరకు అందిన 25 మండలాల ప్రతిపాదనలు మండలాలకు తిప్పి పంపారు. తిరిగి పంపాలని సూచించారు. పనుల ప్రతిపాదనలకు సంబంధించి మండల పరిషత్, జెడ్పీ పాలకవర్గం సమావేశమై వారు ప్రత్యేకంగా తీర్మానం చేసుకునే అధికారం ఉంది.
అయితే సర్పంచ్‌లు చేసిన తీర్మానాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అధికారం మాత్రం మండల పరిషత్‌లకు లేదు. పనుల ప్రతిపాదనలకు సంబంధించి మండల పరిషత్, సర్పంచ్‌లు గుర్తించిన పనుల్లో ఏమైన తేడాలు ఉన్నట్లయితే వాటిని మాత్రమే సరిచేస్తారు. ఉదాహరణకు ఏదేని గ్రామంలో చేపట్టిన పనికి నిధులు చాలని పక్షంలో ఆ గ్రామానికి మండల పరిషత్ నుంచి కేటాయిస్తారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు గుర్తించిన పనులు రెండు ఒకేరకంగా ఉన్నట్లయితే వాటిని కూడా రద్దు చేస్తారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పనులకు కూడా మండల పరిషత్ కోటా నుంచి నిధులు కేటాయించే అవకాశం ఉంది. పనులను ప్రతిపాదించడంలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే సర్పంచ్‌లు చేసిన తీర్మానాలను కూడా తిప్పి పంపారు.