రెండు గంటలపాటు నిలిచిన పోలింగ్
తాండూర్, న్యూస్‌లైన్ : మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ పరిధిలోని బోయపల్లి, చౌటపల్లి పోలింగ్ కేంద్రాల్లో సుమారు రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ను స్థానికులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
చౌటపల్లి గ్రామస్తులకు చెందిన ఓటర్లకు బోయపల్లి పోలింగ్ కేంద్రంలో, బోయపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తుల ఓట్లను చౌటపల్లి పోలింగ్ కేంద్రానికి వెళ్లి వేయాల్సి రావడంపై స్థానిక నాయకులు, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. చౌటపల్లి గ్రామంలోని 1,2, 3, 9, 10 వార్డులకు చెందిన సుమారు 800 మంది ఓటర్లు బోయపల్లి పోలింగ్ కేంద్రంలో, బోయపల్లి 4,5,6,7,8 వార్డులకు చెందిన సుమారు 600 మంది ఓటర్లు చౌటపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది.
పోలింగ్ కేంద్రాలకు ఓట్లను విభజించే ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఓట్లు వేయమని పేర్కొనడంతో పోలింగ్ నిలిచిపోయింది. దీంతో ఎన్నికల అధికారి కుమారస్వామి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పవన్‌కుమార్, శ్రీదేవి, డీఎస్పీ కె.ఈశ్వర్‌రావు బోయపల్లికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు అధికారులు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి అధికారులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తామని, ఓటింగ్‌కు సహకరించాలని కోరడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత ఓటింగ్ యథావిధిగా కొనసాగింది. డీఎస్పీ వెంట తాండూర్, మాదారం ఎస్సైలు అజయ్‌బాబు, కుమారస్వామి ఉన్నారు.