టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో...
- కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భీమారం వాసి
- వైద్యానికి ఇప్పటికే రూ.5 లక్షలు ఖర్చు
- పట్టించుకోని టీఆర్‌ఎస్ శ్రేణులు
- ఆపన్న హస్తం కోసం బాధితుడి ఎదురుచూపు
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓయూ విద్యార్థి విక్రమ్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని సహచర పరిశోధక విద్యార్థి, స్నేహితుడు మూర్తి పేర్కొన్నారు. హన్మకొండలోని భీమారానికి చెందిన విక్రమ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు.
టీఆర్‌ఎస్వీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పైగల అభిమానంతో ఆయన గెలుపు కోసం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజవర్గంలో తన అనుచరులతో కలిసి ఏప్రిల్ 22న ఎన్నికల ప్రచారం కోసం కారులో వెళ్తుండగా షామీర్‌పేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి విక్రమ్ గాయపడ్డాడు. ఎడమ కాలు విరిగి, తల, ముఖానికి గట్టిగా దెబ్బలు తగిలి స్పృహ కోల్పోవడంతో తొమ్మిది రోజులుగా యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆస్పత్రిలో ఇప్పటికీ రూ.5 లక్షలు ఖర్చయ్యాయని, అందులో హాస్టల్ విద్యార్థుల ఒక రోజు భోజనం ఖర్చు, దాతలు అందించిన నిధుల మొత్తాన్ని రూ.3 లక్షలు చెల్లించినట్లు మూర్తి వివరించారు. ఇంకా రూ.2 లక్షలు చెల్లించడంతోపాటు మరో పది రోజుల వరకు ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. విక్రమ్ నిరుపేద కుటుంబానికి చెందిన వాడైనందున వైద్యానికి అవుతున్న ఖర్చును భరించే పరిస్థితుల్లో లేరు. అందువల్ల టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆర్థిక సాయం అందించాలని కోరారు.