* ఎంపీ కవితపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్‌రెడ్డిపై అధికారపక్షం ధ్వజం
* టీడీపీ సభ్యుడుక్షమాపణలు చెప్పాలని డిమాండ్
* ముందుగా కేటీఆర్‌పై సభాహక్కుల నోటీసుకు చర్య తీసుకోవాలన్న టీడీపీ
* రెండు పార్టీల ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: పాలక, విపక్షాల వాదోపవాదాలు, నిరసనల మధ్య శాసనసభ దద్దరిల్లింది. నిజామాబాద్ ఎంపీ కవితపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ సభ్యుల నిరసనకు, ఉద్రిక్తతకు దారితీసింది. సమగ్ర కుటుంబ సర్వేలో ఎంపీ కవిత రెండు చోట్ల తన పేరును నమోదు చేసుకున్నట్లు మంగళవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. దీనిపై బుధవారం అసెంబ్లీలో దుమారం రేగింది. రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారని, నిజామాబాద్ ఎంపీకి, అసెంబ్లీ సభ్యులందరికీ ఆయన క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు.
దీనిపై ఏమాత్రం తొణకని టీడీపీ సభ్యులు.. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే ముందు మంత్రి తారకరామారావుపై ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పట్టుపట్టారు. దీంతో ఇరుపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికింది. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే మరే అంశాన్నైనా ప్రస్తావించాలని అధికారపక్షం పట్టుబట్టడంతో రెండు గంటల పాటు సభ స్తంభించిపోయింది. రేవంత్‌రెడ్డి చేసిన అభియోగాలకు సంబంధించి వివిధ పార్టీల నేతల అభిప్రాయాలను స్పీకర్ కోరారు. అవి తప్పుడు అభియోగాలైతే.. భేషజానికి పోకుండా వాటిని ఉపసంహరించుకోవాలని వారంతా సూచించారు. అంతకుముందు సాధారణ బడ్జెట్‌పై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగం తర్వాత రేవంత్‌రెడ్డి ప్రసంగించాల్సి ఉంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై సభా ఉల్లంఘన నోటీసును ప్రస్తావించే సమయంలోనే.. టీఆర్‌ఎస్ సభ్యురాలు గొంగడి సునీత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ఎంపీ కవిత అంశాన్ని లేవనెత్తారు.
తాత జాగీరా?: మంత్రి ఈటెల
ఎంపీలు, ఎమ్మెల్యేలపై మాట్లాడే ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందని, అయితే నోటీస్ ఇవ్వకుండానే రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. దీంతో వివాదం ఒక్కసారిగా రాజుకుంది. వాగ్వాదాల మధ్య సభను పదినిమిషాల పాటు స్పీకర్ వాయిదావేశారు.
కేటీఆర్‌పై సభా హక్కుల నోటీస్‌కు పట్టు
సభ తిరిగి ప్రారంభం కాగానే మంత్రి కేటీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అంశాన్ని రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రస్తావించారు. సభ్యుల వ్యాఖ్యల మధ్యే సభను స్పీకర్ మరోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ మొదలుకాగానే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..క్రైస్తవ మైనారిటీ సభ్యులను అసెంబ్లీకి నామినేట్ చేసినట్లు ఈ ఎమ్మెల్యేలను ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిందని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మంగళవారం సభలో వ్యాఖ్యానించటం ప్రజలను, తమను, స్పీకర్‌ను అవమానపరటమేనన్నారు. సభాహక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకుని కేటీఆర్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
ఎంపీలపై ఆరోపణలు చేసే ముందు స్పీకర్ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో ఉన్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు. అయితే తాము ఇదివరకే స్పీకర్ అనుమతి తీసుకున్నందున మంత్రి కేటీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన అంశాన్ని మొదట తీసుకోవాలని రేవంత్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ మధుసూదనాచారి గురువారానికి వాయిదా వేశారు.
ఎంపీని అవమానిస్తారా?
Published Thu, Nov 13 2014 2:24 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM
Advertisement