తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా నియమించనున్న పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయ మంత్రి హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా నియమించనున్న పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయ మంత్రి హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చే సింది. చట్టసభల్లోని సభ్యులు మాత్రమే పార్లమెంటరీ కార్యదర్శులుగా నియామకానికి అర్హులని స్పష్టంచేసింది. అవసరమైనపుడు సీఎం వీరికి ఏ బాధ్యతనైనా అప్పగించవచ్చని తెలిపింది.
పార్లమెంటరీ కార్యదర్శుల వేతన, భత్యాలతోపాటు వివిధ నిబంధనలను వివరిస్తూ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా నలుగురు ఎమ్మెల్యేల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే. ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, జలగం వెంకట్రావు, దాస్యం వినయ్‌భాస్కర్, కోవ లక్ష్మిని ఈ పదవులకు ఎంపికచేశారు. వీరితోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నోటిఫికేషన్‌లోని వివరాలివీ..
పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే వారు విధిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.
వీరికి తెలంగాణ వేతనాలు, పింఛను చెల్లింపులు, అనర్హతల తొలగింపు చట్టం-1953 ప్రకారం రాష్ట్ర మంత్రికి వర్తించే వేతన, భత్యాలు చెల్లించవచ్చు.
పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన వ్యక్తి చట్టసభల్లో సభ్యుడై అక్కడ వేతన, భత్యాలు స్వీకరించినా.. కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక వచ్చే ప్రయోజనాలు కూడా పొందడానికి అర్హులు.