వెలుగుల వేళ.. | The threat posed to the sound of fireworks | Sakshi
Sakshi News home page

వెలుగుల వేళ..

Published Thu, Oct 23 2014 12:06 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

వెలుగుల వేళ.. - Sakshi

వెలుగుల వేళ..

  • టపాసుల మోతతో పొంచి ఉన్న ముప్పు
  •  చిన్నారులు,పెంపుడు జంతువులు, ఆస్తమా బాధితులపై ప్రభావం
  •  పర్యావరణానికీ హాని
  •  సరైన జాగ్రత్తలతోనే ప్రమాదాలకు దూరం
  • దీపావళి... ఆబాలగోపాలాన్ని ఆనందంలో ముంచే పండుగ. అందరి సరదాలకూ వేడుక. ఆత్మీయానందాల కలయిక. సంతోషాల కాకరపువ్వొత్తులు... మమతల మతాబులు... చిరునవ్వుల చిచ్చుబుడ్లు వె లిగే రోజిది. వెలుగులు పంచే బాణసంచా విషాదాన్ని మోసుకొచ్చే ప్రమాదమూ ఉంది. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ దివ్వెల పండుగను   జరుపుకుంటే ఉత్సాహం అలాగే మనతో పాటూ ఉంటుంది.

    సాక్షి, సిటీబ్యూరో: దీపావళి రోజున మతాబుల జిలుగు వెలుగులు, టపాసుల మోత శ్రుతి మించితే ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టపాసుల మోత అవధులు మించితే చిన్నారులు, పెంపుడు జంతువుల మనుగడే ప్రశ్నార్థక మయ్యే ప్రమాదం ఉంది. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ భారీగా పెరిగి శ్వాసకోశ, కళ్ల సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా టపాసులశబ్దాలు నివాస ప్రాంతాల్లో 45 డెసిబుల్స్ (ధ్వనిని కొలిచే ప్రమాణమే డెసిబుల్) మించరాదు.

    నగరంలో ఈ శబ్దాలు 90 డెసిబుల్స్‌కు మించుతుండడంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోదా, ఆర్భాటం కోసం అత్యధిక ధ్వనిని వెదజల్లే టపాసులు కాల్చితే మనకే కాదు.. మన చుట్టు పక్కల వారికీ చేటు కలిగిస్తున్నామనే స్పృహ అవసరమని స్పష్టం చేస్తున్నారు. టపాసుల మోత శ్రుతి మించితే కలిగే అనర్థాలు, కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఫోకస్..
     
    శిశువులు జాగ్రత్త

    గ్రేటర్‌లో నిత్యం సుమారు 800-1000 మంది శిశువులు కళ్లు తెరుస్తున్నారు. నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తడం తథ్యమంటున్నారు.
     
    పెంపుడు జంతువుల్లో

    సాధారణంగా పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి లాంటివి 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని  సంబంధిత వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరి బద్దలయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అతిధ్వనులు విన్న జంతువులు ఇంటి నుంచి పరుగెత్తి రోడ్డు ప్రమాదాల బారిన పడడం, కరవడం వంటివి చేస్తాయని చెబుతున్నారు. రాకెట్లు, భూచక్రాలు కాల్చినపుడు పెంపుడు జంతువులకు తగిలి గాయాల పాలవుతాయి. ఎపిలెప్సీ(వణుకుడు)బారిన పడతాయి.
     
    పెరగనున్న వాయుకాలుష్యం

    టపాసులు కాల్చినపుడు వెలువడే పొగలో సల్ఫర్‌డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళి రేణువులు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ముఖ్యంగా సల్ఫర్ డై ఆక్సైడ్ క్యూబిక్ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ టపాసులు అత్యధికంగా కాల్చినపుడు 450-500 మైక్రోగ్రాములకు చేరుకుంటుంది. దీంతోఊపిరితిత్తులకు హాని తథ్యం. బ్రాంకైటిస్ (తీవ్రమైన దగ్గు) తప్పదని వైద్యులు చెబుతున్నారు.

    నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితి క్యూబిక్ మీటరు గాలికి 80 మైక్రోగ్రాములు మించరాదు. టపాసులు అత్యధికంగా కాల్చినపుడు 450-500 మైక్రోగ్రాముల వరకు ఇది పెరుగుతుంది. దీంతో కళ్లు, ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్రఇబ్బంది కలుగుతుంది. ధూళి రేణువులు(ఎస్‌పీఎం) క్యూబిక్ మీటరు గాలిలో 100 మైక్రోగ్రాములు మించరాదు. కానీ 300 మైక్రో గ్రాములు మించే పరిస్థితి తలెత్తడంతో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
     
    కర్ణభేరికి ప్రమాదం
    90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల కర్ణభేరిలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వృద్ధులకూ శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ఒకేచోట అత్యధిక ధ్వనిని ఇచ్చే టపాసులు కాల్చితే ప్రమాదం తప్పదు. మార్కెట్‌లో ఇయర్ ప్లగ్స్ రూ.500 నుంచి రూ.1000కి లభ్యమవుతాయి. వీటిని వినియోగిస్తే శబ్ద కాలుష్యం నుంచి ఉపశమనం పొందవచ్చు.
     - డాక్టర్ రవిశంకర్, ఈఎన్‌టీ వైద్య నిపుణులు, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి
     
     కంటికీ ముప్పు
     బాణసంచా కాల్చేటప్పడు వెదజల్లే మిణుగురులు, ఇతర కార్బన్ పదార్థాలు పొరపాటున కంట్లో పడితే కన్ను దెబ్బతినే అవకాశం ఉంది. తారాజువ్వలు పొరపాటున కంట్లోకి దూసుకుపోతే.. కంటిచూపు పూర్తిగా కోల్పొయే ప్రమాదం ఉంది. దీపావళి తర్వాత ఏటా సగటున వంద మంది బాధితులు సరోజినిదేవి ఆస్పత్రికి వస్తున్నారు. సిల్క్ వస్త్రాలు, లూజుగా ఉన్న దుస్తులు ధరించవద్దు. ఒత్తులు ఆరిపోతే వాటి ద గ్గరికి వెళ్లి తొంగి చూడొద్దు. చేత్తో పట్టుకోవద్దు. చేతులు, ముఖం కాలితే మంట తగ్గేవరకు చల్లటి నీరు పోయాలి.    
     - డాక్టర్ రవీందర్‌గౌడ్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి
     
     చిన్నారుల్లో బుద్ధిమాంద్యం
     అత్యధిక ధ్వనులు విన్నపుడు చిన్నపిల్లల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. వారిలో బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. కొన్నిసార్లు చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చికాకు, అసహనం కలుగుతుంది.
     - డాక్టర్ నరహరి, చిన్నపిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ ఆస్పత్రి
     
     ఆస్తమా బాధితులూ జాగ్రత్త
     బాణసంచా నుంచి సల్ఫర్‌డై ఆకై ్సడ్, నైట్రోజన్ డై ఆకై ్సడ్, కార్బన్ డై ఆకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్‌లు వెలువడుతాయి. వీటిలో 70 శాతం పొటాషియం అయోడైడ్, 15 శాతం కార్బన్, 10 శాతం సల్ఫర్ ఉంటుంది. ఈ పదార్థాలు మనిషి ఊపిరితిత్తులు, కళ్లు, చెవులు, చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పటికే నగరంలో 30-40 శాతం మంది ఆస్తమాతో బాధ పడుతున్నారు.
     - డాక్టర్ సునంద, ఫల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి
     
     విద్యుత్ లైన్ల కింద కాల్చవద్దు
     విద్యుత్‌లైన్ల కింద రాకెట్లు, తారా జువ్వలు వెలిగించరాదు.
         
     ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల సమీపంలో పెద్ద శబ్దాలు వచ్చే వాటిని కాల్చొద్దు
         
     ప్రమాదవశాత్తూ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ జరిగితే వెంటనే సరఫరా నిలిపివేయాలి
         
     వీధిలోని, అపార్టుమెంట్‌లోని వారంతా ఖాళీ ప్రదేశానికి చేరుకుని ఒకే చోట బాంబులు కాల్చడం మంచిది.
         
     అత్యవసర పరిస్థితుల్లో 1912 సర్వీసు నెంబర్‌కు సమాచారం ఇవ్వాలి.
     - ఎ.జి.రమణ ప్రసాద్,తెలంగాణ విద్యుత్ తనిఖీ విభాగం
     
     పాఠశాలలు, ఆస్పత్రుల వద్ద నిషేధం

     నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రహదారులు, పాఠశాలలు, ఆస్పత్రుల వద్ద బాణసంచా కాల్చడం నిషేధం.
         
     రాత్రి పది నుంచి ఉదయం 6 గంటల వరకు టపాసులు కాల్చ వద్దు.
         
     సాధ్యమైనంత వరకు తక్కువ శబ్ద సామర్థ్యం ఉన్న బాణసంచానే ఎంచుకోవాలి.
         
     ధ్వని సామర్థ్యం పారిశ్రామికవాడలో పగలు 75, రాత్రి 70, కమర్షియల్ జోన్‌లో పగలు 65, రాత్రి 55, రెసిడెన్షియల్ ఏరియాలో పగలు 55, రాత్రి 45, సెలైన్స్ జోన్‌లో పగలు 50, రాత్రి 40 డెసిబుల్స్ మించకుండా చూడాలి.
     
     - వి.అనిల్‌కుమార్, సభ్య కార్యదర్శి, పీసీబీ
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement