గాలి రాక.. బురద తీయక..!
బెల్లంపల్లి : ప్రకృతికి విరుద్ధంగా భూగర్భంలోకి వెళ్లి కార్మికులు బొగ్గు ఉత్పత్తి కోసం నరకయాతన పడుతున్నారు. తీవ్రమైన వేడితో సతమతమవుతున్నారు. ఎడతెగని ఉరుపులు, మోకాలులోతు బురదలో విధులు నిర్వహించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. బురదలో జారిపడి రోజుకో ప్రమాదానికి గురవుతున్నారు. పని స్థలాలను మెరుగుపర్చి, కనీస సదుపాయాలు కల్పించాల్సిన గని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కార్మికులపై పనిభారం పెంచి ‘దొర’తనాన్ని ప్రదర్శిస్తున్నారు. కార్మికుల పక్షాన నిలవాల్సిన గుర్తింపు సంఘ నాయకులు పట్టింపు లేని ధోరణిని ప్రదర్శిస్తున్నారు.
మందమర్రి ఏరియా పరిధిలోని శాంతిఖని గని కార్మికులు బొగ్గు ఉత్పత్తిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గనిలో సుమారు 700 మంది వరకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు సగటున సుమారు 200 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. గని భూగర్భంలో పని స్థలాలు సరిగా లేక కార్మికులు ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. గనిలోని భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో కార్మికులు సరిగా విధులు నిర్వహించలేకపోతున్నారు.
గర్మీతో సతమతం
శాంతిఖని నార్త్‌ట్రంక్-4 డిప్ 50 లెవల్ నుంచి 55 లెవల్ వరకు పని స్థలాల్లో గాలి సరఫరా జరగడం లేదు. అక్కడ విధులు నిర్వహించడానికి కార్మికులు రోజు ఎంతో సాహసం చేయాల్సి వస్తోంది. గాలిలో తేమశాతం పెరిగి తీవ్రమైన వేడి, ఉక్కపోతతో కార్మికులు విధులు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాన్లు నామమాత్రంగా ఉండటం వల్ల కార్మికులకు అంతగా ప్రయోజనం లేకుండా పోతోంది. భరించలేని వేడి వల్ల కార్మికులు విధులు నిర్వహిస్తూనే కింద పడిపోయి అస్వస్థతకు గురవుతున్నారు. గనిపైకప్పు నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుపులు(నీటిధార) పడుతుండటంతో కార్మికులు తడుస్తున్నారు. ఎనిమిది గంటలు నిరంతరంగా తడవడం వల్ల శారీరక సమస్యలు ఏర్పడుతున్నాయి. అనేక మంది కార్మికుల కాలి వేళ్లకు పుండ్లై నడవలేకపోతున్నారు. గజ్జల్లో దురద ప్రబలి ఇబ్బందులకు గురవుతున్నారు.
బురదలో తప్పని తిప్పలు
గనిలోని పని స్థలాల వద్ద ఎప్పుడు విపరీతమైన బురద ఉండటంతో కార్మికులు ఎన్నో బాధలు పడుతున్నారు. రోజు ఒకరిద్దరు కార్మికులు బురదలో అదుపు తప్పి కింద పడిపోతున్నారు. గాయాలు తగిలి ఆస్పత్రిపాలవుతున్నారు. గనిలోని 50 లెవల్ నుంచి 55 లెవల్ వరకు మోకాలులోతు బురద ఉంది. ఆ బురదలో కాలుతీసి కాలు పెట్టే పరిస్థితులు లేవు. కార్మికులు జారిపడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా చోటు చేసుకుంటున్నా నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
పెరిగిన పని భారం
గనిలో సదుపాయాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు పనిభారం పెంచి కార్మికులను తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా కార్మికులతో పనులు చేయించుకుంటున్నారు. పెరిగిన పని ఒత్తిడిని కార్మికులు తట్టుకోలేకపోతున్నారు. పని భారం పెంచిన అధికారులు సేద తీర్చుకోవడానికి కార్మికులకు కనీసం ఐదు నిమిషాలు కూడా వెసులుబాటు కల్పించడం లేదు. చెప్పినట్లు పని చేయని కార్మికులకు అధికారులు వార్నింగ్ లేఖలు, చార్జిషీట్లు జారీ చేస్తున్నారు. తోటి కార్మికుల ముందు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.
పట్టింపు ఏది?
కార్మికుల వెన్నంటి ఉండి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునే కార్మిక సంఘ ప్రతినిధులు గనిలో లేకుండా పోయారు. గుర్తింపు సంఘ నాయకులు కొందరు ఉచితంగా మస్టర్లు పడి ఇంటికి వెళ్లడమే కాని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజ మాన్యంతో సంప్రదించి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడం లేదు. గనిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు దోహదపడాల్సిన కార్మిక నాయకులు అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో అధికారులది ఇష్టారాజ్యంగా మారింది. ఇప్పటికైనా గుర్తింపు సంఘ నాయకులు సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.