దిక్కులేని ఉన్నత విద్య!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ వీసీలు కరువు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో యూనివర్సిటీలు అనాథలవుతున్నాయి. దిక్కూమొక్కూ లేకుండా కుంటుతూ నడుస్తున్నాయి. వాటి ఆలనాపాలనా చూసే వారే కరువయ్యారు. విశ్వవిద్యాలయాలను పట్టించుకునే తీరికే రాష్ర్ట ప్రభుత్వానికి లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలోని ఏ ఒక్క యూనివర్సిటీకి వైస్‌చాన్స్‌లర్లు లేని పరిస్థితి తలెత్తింది. శనివారం నాటికి మరో మూడు వర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే మిగతా వర్సిటీలకు వీసీలు లేరు. దీంతో ఇకపై రాష్ర్టంలోని పది విశ్వవిద్యాలయాలూ ఇన్‌చార్జుల పాలనలోనే నడవనున్నాయి. వారెప్పుడూ యూనివర్సిటీ దరిదాపుల్లోకి రారు. అక్కడి సమస్యలు, ప్రాధాన్యతలను పట్టించుకోరు. ఇన్‌చార్జి వీసీలు విధులు నిర్వహిస్తున్నా సచివాలయం లేదా ఉన్నత విద్యా శాఖ కార్యాలయానికే ఫైళ్లు వస్తాయి. అక్కడే చూసి ఆమోదిస్తారు.
అదీ ఆయా వర్సిటీల సిబ్బంది రోజుల తరబడి ఫైళ్లు పట్టుకుని తిరిగిన తర్వాతే! ఇంత దారుణమైన పరిస్థితులు దేశంలో మరెక్కడా కనిపించవని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విశ్వవిద్యాలయం ఉస్మానియాకు వీసీ లేక తొమ్మిది నెలలవుతోంది. ఉత్తర తెలంగాణకు విద్యా కేంద్రంగా భాసిల్లుతున్న కాకతీయ వర్సిటీకి ఏడాది దాటింది. శాతవాహన వర్సిటీ వీసీ వీరారెడ్డి శుక్రవారమే పదవీ విరమణ చేయగా, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ శివారెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీ భాగ్యనారాయణ శనివారం రిటైర్ అవుతున్నారు. ఆదివారం నుంచి రాష్ర్టంలోని పది విశ్వవిద్యాలయాలకూ వీసీలు ఉండరు. వీసీలు లేక విలవిల్లాడుతున్న ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు ఇప్పటికీ సెర్చ్ కమిటీలు వేయకపోవడం విస్తుగొలుపుతోంది. ప్రస్తుతం ఈ వర్సిటీల్లో పరిపాలన పూర్తిగా స్తంభించింది. నియామకాలు ఆగిపోయాయి. కీలకమైన వర్సిటీ కాలేజీల్లో ఫ్యాకల్టీ లేదు. దీంతో బోధన, పరిశోధన రెండూ అటకెక్కాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలోనూ ఎడతెగని జాప్యం జరుగుతోంది.
సిబ్బంది కొరత:యూనివర్సిటీ కాలేజీల్లో బోధన సిబ్బంది పోస్టులు సగానికిపైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఎంతో ఘనకీర్తి కలిగిన ఉస్మానియాలోనూ ఇదే దుస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్నత విద్య నిర్వీర్యమవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓయూలో 1,230 బోధనా సిబ్బంది పోస్టుల్లో 630 ఖాళీలున్నాయి. పదవీ విరమణ చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించడం లేదు. ఫలితంగా నాలుగే ళ్లుగా వర్సిటీ పరిస్థితి దిగజారింది. ఇక పాలమూరు వర్సిటీలో ఆరుగురు బోధనా సిబ్బంది, ఇద్దరు బోధనేతర సిబ్బందితో పాలన సాగుతోంది.
అన్నీ సమస్యలే..: వీసీలు లేని వర్సిటీలకు విద్యా శాఖలో సీనియర్ అధికారులను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నారు. ఉస్మానియా, అంబేద్కర్ వర్సిటీలకు ఇన్‌చార్జ్‌గా ఉన్న విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య ఆపాయింట్‌మెంట్ దొరకడమే వర్సిటీ అధికారులకు గగనమైపోయింది. ఒక వృత్తి విద్యా కోర్సు పరీక్ష ఫలితాలకు అన్నీ సిద్ధం చేసినా సంబంధిత ఫైల్‌ను రంజీవ్‌ఆచార్య ఆమోదించకపోవడంతో ఫలి తాలను వారం రోజుల తర్వాత ప్రకటించాల్సి వచ్చింది. ‘మాకు నెలనెలా జీతాలు ఇవ్వడం తప్పితే వర్సిటీలో ఏ పనీ సవ్యంగా లేదు.’ అని ఉస్మానియా ప్రొఫెసర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
పక్కా వ్యవస్థతోనే మనుగడ
ప్రస్తుతం వర్సిటీల్లో విద్యార్థులు తగ్గిపోతున్నారు. పర్యవేక్షణ లేకుండా పో తోంది. ఫ్యాకల్టీ, వీసీలను నియమించి గాడిలో పెట్టాలి. ఇప్పుడు నియమించినా వర్సిటీలను గాడిలో పెట్టేందుకే ఏడాది పడుతుంది. లేకపోతే అవి ఎందుకూ పనికిరానివిగా తయారవుతాయి. అంతేకాదు కొత్త రాష్ట్రంలో పక్కా పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థ అవసరం. యూనివర్సిటీ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
- అర్జుల రామచంద్రారెడ్డి, మాజీ వీసీ
వీసీలు లేకపోతే ఎలా?
జ్ఞానాన్ని పంచాల్సిన కేంద్రాలు మూలనపడ్డాయి. స్కూళ్లలోలా పుస్తకంలో ఉన్నది చెప్పడం కాదు.. పరిశోధనలను విస్తరించేందుకు ప్రొఫెసర్లు మార్గదర్శనం చేస్తారు. కానీ ప్రొఫెసర్లే లేకపోతే ఇక బోధించేదెవరు? ఇప్పటికైనా ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలి. లేకపోతే నేర్చుకునేది ఏమీ ఉండదు. ముఖ్యంగా వీసీలు లేకపోతే వర్సిటీల మనుగడకు ప్రమాదం తప్పదు.
- చుక్కా రామయ్య, విద్యావేత్త